మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా కామెడీ ని ఏలిన నవ్వుల రారాజు బ్రహ్మానందం. ప్రపంచం మొత్తంలో బ్రహ్మి లాంటి కమెడియన్ ఒక్కరే ఉంటారు.. ఆయన స్థాయిలో ఎవ్వరూ నవ్వించి ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఐతే మూడు దశాబ్దాల పాటు విరామం లేకుండా సినిమాలు చేసిన బ్రహ్మి.. గత కొన్నేళ్ల నుంచి పెద్దగా తెరపై కనిపించడం లేదు. మధ్యలో కొన్నేళ్లు పూర్తిగా అదృశ్యం అయిపోయారు కానీ.. ఈ మధ్య మళ్లీ బిజీ అవుతున్నారు.
కేవలం కామెడీ అనే కాక ‘రంగమార్తాండ’ లాంటి చిత్రాల్లో సీరియస్ రోల్స్ కూడా చేశారు. ఇప్పుడాయన ఒక ప్రత్యేకమైన కామెడీ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘కీడా కోలా’లో బ్రహ్మి ఒక వెరైటీ రోల్ చేశాడు. అనారోగ్యంతో బాధ పడుతూ చక్రాల కుర్చీకి పరిమితమైన పాత్ర అది. అందులో కూడా బ్రహ్మి బోలెడన్ని నవ్వులు పంచుతాడని టీం చెబుతోంది.
‘కీడా కోలా’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బ్రహ్మి ప్రసంగం అందరినీ అమితంగా ఆకట్టుకుంది. తరుణ్ భాస్కర్ తనకు జంధ్యాలను గుర్తు చేశాడంటూ.. ఆయన లాగే అందరూ ఎంజాయ్ చేసేలా క్లీన్ కామెడీ అందించాడని.. ఈ సినిమా షూటింగ్‌ను ఎంతగానో ఆస్వాదించానని బ్రహ్మి అన్నాడు. ఇక కామెడీకి ఉన్న విశిష్టత గురించి బ్రహ్మి చెప్పిన మాటలు భలేగా అనిపించాయి. ఒక సినిమాలో ఒక నటుడు బాగా చేస్తే.. ఎమోషన్లు బాగా పండితే.. ఇంకేదైనా బాగా అనిపిస్తే.. ఇంటికి వెళ్లాక అనుభూతి చెంది దాన్ని అప్రిషియేట్ చేస్తామని.. కానీ కామెడీ మాత్రం ఇలా కాదని బ్రహ్మి అన్నాడు.
కామెడీ అంటే అప్పటికప్పుడు నవ్వాలని.. అలా నవ్వితేనే కామెడీ పండినట్లని.. లేదంటే లేదని బ్రహ్మి అన్నాడు. మిగతా రసాల మాదిరి ఇంటికి వెళ్లి అప్పుడు ఫీలై నవ్వుకోవడం కాదని.. ఇన్‌స్టంట్‌గా కామెడీ పండిందో లేదో తేలిపోతుందని.. కానీ అలా నవ్వించడం అంత తేలిక కాదని బ్రహ్మి అన్నాడు. తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’లో ప్రేక్షకులు థియేటర్లలోనే కడుపుబ్బ నవ్వేలా కామెడీ పండించాడని బ్రహ్మి చెప్పాడు.