నవ్వుకే నవ్వు పుట్టించగల సమర్థుడు హాస్యనటబ్రహ్మ ‘బ్రహ్మానందం’ .ఈ ఫిబ్రవరి 1 తో 65 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు ‘బ్రహ్మానందం’. ఆయన పూయించిన నవ్వుల సుగంధంతోనే తెలుగు ప్రేక్షకులు రోగాలకు దూరంగా జరిగి , భోగం అనుభవిస్తున్నారని చెప్పవచ్చు . ‘ నవ్వు , నవ్వించు , ఆ నవ్వులు పండించు ‘ అన్నట్టుగా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే ‘బ్రహ్మానందం’ చిత్రసీమలో తన నవ్వుల నావ నడపడానికి ముందు చిరునవ్వుతోటి విషవలయాలను ఛేదిస్తూ ముందుకు సాగారు . ఉమ్మడి కుటుంబంలో మధ్య తరగతి జీవనం సాగిస్తున్న ‘బ్రహ్మానందం’కు అనుకుంటే చాలు సినిమాకు వెళ్ళేంత ఆర్థిక బలం ఉండేది కాదు . దాంతో చిన్నప్పటి నుంచీ నవ్వునే నమ్ముకొని హాస్యబలం పెంచుకున్నారు . బాల్యంలోనే తనకు తెలిసిన వారిని అనుకరిస్తూ , వారి చేష్టలను చూపించి తన చుట్టూ ఉన్న వారికి నవ్వులు పంచేవారు .
ఏ ముహూర్తాన ఆయన కన్నవారు ‘బ్రహ్మానందం’ అని నామకరణం చేశారో కానీ , అందరికీ ఆనందం పంచడానికే ఈ ‘బ్రహ్మానందం’ అన్నట్టుగా ఆయన చలన చిత్ర జీవితం సాగింది.
వారిద్దరి తరువాత
అత్తిలిలో అధ్యాపకునిగా కొనసాగుతూనే ‘బ్రహ్మానందం’ పలు సాంస్కృతిక కార్యక్రమాలలో తన స్వరఅనుకరణతో అలరించే వారు . దూరదర్శన్ లో బ్రహ్మానందం పండించిన ‘ పకపకలు ‘ ఇప్పటికీ గుర్తు చేసుకొని నవ్వుకొనేవారెందరో ! జంధ్యాల ‘ సత్యాగ్రహం’లో ఓ చిన్న పాత్రలో తొలిసారి కనిపించారు ‘బ్రహ్మానందం’ .వేజెళ్ళ సత్యనారాయణ ‘ శ్రీతాతావతారం’లోనూ ఓ బిట్ రోల్ చేశారు . జంధ్యాల ‘ అహ నా పెళ్ళంట’లో అరగుండుగా నటించి , అందరికీ దగ్గరయ్యారు ‘బ్రహ్మానందం’ . ఆ తరువాత ఆయన మరి వెనుదిరిగి చూసుకోలేదు . అందిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాగారు . అందరికీ నవ్వులు పంచుతూనే తెలుగునాట హాస్యనటుల్లో అగ్రస్థానం అధిరోహించారు . ‘బ్రహ్మానందా’నికి ముందు రేలంగి , అల్లు రామలింగయ్య ఇద్దరూ తమదైన హాస్యంతో పకపకలు పండించారు . వారిద్దరికీ పద్మ పురస్కారం లభించింది . వారి తరువాత తెలుగునాట ‘ పద్మ ‘ పురస్కారం అందుకున్న నవ్వుల రేడు ‘బ్రహ్మానందమే’ !
గిన్నిస్ బుక్ లో నవ్వులరాజు
ఒకటా రెండా వందలాది చిత్రాల్లో బ్రహ్మానందం పండించిన నవ్వులు జనానికి కితకితలుపెట్టాయి . ఈ నాటికీ వాటిని తలచుకుంటే చాలు గొల్లున నవ్వులు రాలతాయి . ‘బ్రహ్మానందం’ హాస్యానికి ఇప్పటికి ఐదు సార్లు నంది పురస్కారాలు దక్కాయి . ఈ కామెడీ కింగ్ కరుణరసంతోనూ మురిపించిన సందర్భాలున్నాయి . అలా ఉత్తమ సహాయనటునిగానూ ‘ అన్న’తో నందిని పట్టుకుపోయారు . ఇలా ఆరు సార్లు నందిని అందుకున్న ‘బ్రహ్మానందం’ , వెయ్యికి పైగా చిత్రాలలో నటించి , ఈ నాటికీ నవ్వులు పూయిస్తున్న హాస్యనటునిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్ లోనూ చోటు సంపాదించారు .
ముందు … తరువాత … తెలుగు హాస్యనటుల చరిత్ర రాయవలసి వస్తే , ‘బ్రహ్మానందాని’కి ముందు , ‘బ్రహ్మానందాని’కి తరువాత అని రాయాలని పలువురు ప్రముఖులు ప్రశంసించిన సందర్భాలున్నాయి . ‘బ్రహ్మానందం’ కంటే ముందు రేలంగి , రమణారెడ్డి , ‘పద్మనాభం’ , రాజబాబు , అల్లు రామలింగయ్య వంటి వారు తమదైన హాస్యంతో అలరించారు . వారి స్ఫూర్తితో ఎంతోమంది చిత్రసీమలో ప్రవేశించి , నవ్వులు పండించే ప్రయత్నం చేశారు . అందులో కొందరే సఫలీకృతులయ్యారు . అయితే ‘బ్రహ్మానందం’ కామెడీతో జనానికి కడుపులు చెక్కలు కావడం మొదలయిన తరువాత నుంచీ హాస్యాభినయంపై మమకారం పెంచుకున్న వారెందరో ఉన్నారు . బ్రహ్మానందం చూపిన బాటలో ‘ మిమిక్రీ ‘ చేస్తూ హాస్యం పంచవచ్చునని భావించిన వారు తొలుత స్వరఅనుకరణతో జనాన్ని మెప్పించి , తరువాత చిత్రసీమలో రాణించారు . అలాంటివారికి సైతం ‘బ్రహ్మానందం’ తగిన ప్రోత్సాహమిచ్చారు . ఇక తమ హాస్యనటుల్లో కూడా కథానాయకులుగా రాణించగల దిట్టలు ఉన్నారంటే , వారికీ తగిన ప్రోత్సాహం అందించారు . తమ హాస్యకుటుంబంలోని కొందరు సభ్యులు దర్శకులుగా మారడానికి ఆయన ప్రోత్సాహమే కారణం . అందుకే తెలుగు సినిమా హాస్య చరిత్రలో ‘బ్రహ్మానందం’కు ముందు , తరువాత అని రాయాల్సి ఉంటుందని అంటారు .
కనిపిస్తే చాలు …
‘బ్రహ్మానందం’ తెరపై నవ్వించి , జనానికి కడుపులు చెక్కలు చేసి , కళ్ళల్లో నీరు తెప్పిస్తాడు . నిజజీవితంలో కన్నీళ్ళను కడుపులోనే దాచుకొని , నవ్వులనే ఇతరులకు పంచిన వైనం కొందరికే తెలుసు . షూటింగులకు సరైన సమయానికి రాడు అనే అపప్రద కూడా ఆయనపై ఉంది . ఎలా వస్తాడు మరి ! ఒకప్పుడు తీరిక లేకుండా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి సినిమాల్లోనూ ఆయన నవ్వుల నావనే సాగేది . దానిని అటు , ఇటు పయనం కట్టాలంటే , కాసింత ఆలస్యమవుతుంది మరి . దీనిని కాదనేవారెవరు ? మొన్నటి దాకా తీరిక లేకుండా నవ్వులు పండించిన ఈ హాస్యనటబ్రహ్మ , కరోనా కల్లోలంలో ఇంటిపట్టునే ఉండి తనలోని ఇతర కళలను బయట పెట్టారు . చిత్రలేఖనంలో ‘బ్రహ్మానందం’ బాణీ చూసి నిత్య చిత్రకారులు సైతం నివ్వెర పోయారు . ‘బ్రహ్మానందం’ ఉంటే చాలు అనుకొనేవారు ఆయన తమ చిత్రాల్లో ఉండాలని కోరుకుంటున్నారు . ఆయనకు మునుపటిలా అవకాశాలు లేవని కొందరు భావించవచ్చు . ఇంకా అవకాశాల వెంట పరుగులు తీసే స్థాయిలో ఆయన లేరు . గత సంవత్సరం సూపర్ డూపర్ హిట్ గా నిలచిన ‘ అల వైకుంఠపురములో ‘ చిత్రం ” రాములో రాములా …. ” పాటలో కొన్ని క్షణాల పాటు మెరిశారు . ఆ మెరుపునే చూసి గతంలో ‘బ్రహ్మానందం’ పంచిన నవ్వులను గుర్తు చేసుకున్నారు జనం . ఆయన నవ్వులు కేవలం తెలుగువారినే కాదు , తెలుగు అర్థం కాని వారినీ అలరించాయి . ‘బ్రహ్మానందం’ హాస్యాభినయం చూసి పరభాషల వారు సైతం కితకితలకు గురవుతున్నారంటే అతిశయోక్తి కాదు . ఇంతలా నవ్వులు పూయించిన , ఇంకా పూయంచడానికి సిద్ధంగా ఉన్న బ్రహ్మానందం మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం .