నిత్యనూతన హాసం..'బ్రహ్మానందం'

నవ్వుకే నవ్వు పుట్టించగల సమర్థుడు హాస్యనటబ్రహ్మ 'బ్రహ్మానందం' .ఈ ఫిబ్రవరి 1 తో 65 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు 'బ్రహ్మానందం'. ఆయన పూయించిన నవ్వుల సుగంధంతోనే తెలుగు ప్రేక్షకులు రోగాలకు దూరంగా జరిగి , భోగం అనుభవిస్తున్నారని చెప్పవచ్చు . ' నవ్వు , నవ్వించు , ఆ నవ్వులు పండించు ' అన్నట్టుగా ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే 'బ్రహ్మానందం' చిత్రసీమలో తన నవ్వుల నావ నడపడానికి ముందు చిరునవ్వుతోటి విషవలయాలను ఛేదిస్తూ ముందుకు సాగారు . ఉమ్మడి కుటుంబంలో మధ్య తరగతి జీవనం సాగిస్తున్న 'బ్రహ్మానందం'కు అనుకుంటే చాలు సినిమాకు వెళ్ళేంత ఆర్థిక బలం ఉండేది కాదు . దాంతో చిన్నప్పటి నుంచీ నవ్వునే నమ్ముకొని హాస్యబలం పెంచుకున్నారు . బాల్యంలోనే తనకు తెలిసిన వారిని అనుకరిస్తూ , వారి చేష్టలను చూపించి తన చుట్టూ ఉన్న వారికి నవ్వులు పంచేవారు .
ఏ ముహూర్తాన ఆయన కన్నవారు 'బ్రహ్మానందం' అని నామకరణం చేశారో కానీ , అందరికీ ఆనందం పంచడానికే ఈ 'బ్రహ్మానందం' అన్నట్టుగా ఆయన చలన చిత్ర జీవితం సాగింది.
వారిద్దరి తరువాత
అత్తిలిలో అధ్యాపకునిగా కొనసాగుతూనే 'బ్రహ్మానందం' పలు సాంస్కృతిక కార్యక్రమాలలో తన స్వరఅనుకరణతో అలరించే వారు . దూరదర్శన్ లో బ్రహ్మానందం పండించిన ' పకపకలు ' ఇప్పటికీ గుర్తు చేసుకొని నవ్వుకొనేవారెందరో ! జంధ్యాల ' సత్యాగ్రహం'లో ఓ చిన్న పాత్రలో తొలిసారి కనిపించారు 'బ్రహ్మానందం' .వేజెళ్ళ సత్యనారాయణ ' శ్రీతాతావతారం'లోనూ ఓ బిట్ రోల్ చేశారు . జంధ్యాల ' అహ నా పెళ్ళంట'లో అరగుండుగా నటించి , అందరికీ దగ్గరయ్యారు 'బ్రహ్మానందం' . ఆ తరువాత ఆయన మరి వెనుదిరిగి చూసుకోలేదు . అందిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాగారు . అందరికీ నవ్వులు పంచుతూనే తెలుగునాట హాస్యనటుల్లో అగ్రస్థానం అధిరోహించారు . 'బ్రహ్మానందా'నికి ముందు రేలంగి , అల్లు రామలింగయ్య ఇద్దరూ తమదైన హాస్యంతో పకపకలు పండించారు . వారిద్దరికీ పద్మ పురస్కారం లభించింది . వారి తరువాత తెలుగునాట ' పద్మ ' పురస్కారం అందుకున్న నవ్వుల రేడు 'బ్రహ్మానందమే' !
గిన్నిస్ బుక్ లో నవ్వులరాజు
ఒకటా రెండా వందలాది చిత్రాల్లో బ్రహ్మానందం పండించిన నవ్వులు జనానికి కితకితలుపెట్టాయి . ఈ నాటికీ వాటిని తలచుకుంటే చాలు గొల్లున నవ్వులు రాలతాయి . 'బ్రహ్మానందం' హాస్యానికి ఇప్పటికి ఐదు సార్లు నంది పురస్కారాలు దక్కాయి . ఈ కామెడీ కింగ్ కరుణరసంతోనూ మురిపించిన సందర్భాలున్నాయి . అలా ఉత్తమ సహాయనటునిగానూ ' అన్న'తో నందిని పట్టుకుపోయారు . ఇలా ఆరు సార్లు నందిని అందుకున్న 'బ్రహ్మానందం' , వెయ్యికి పైగా చిత్రాలలో నటించి , ఈ నాటికీ నవ్వులు పూయిస్తున్న హాస్యనటునిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్ లోనూ చోటు సంపాదించారు .
ముందు ... తరువాత ... తెలుగు హాస్యనటుల చరిత్ర రాయవలసి వస్తే , 'బ్రహ్మానందాని'కి ముందు , 'బ్రహ్మానందాని'కి తరువాత అని రాయాలని పలువురు ప్రముఖులు ప్రశంసించిన సందర్భాలున్నాయి . 'బ్రహ్మానందం' కంటే ముందు రేలంగి , రమణారెడ్డి , 'పద్మనాభం' , రాజబాబు , అల్లు రామలింగయ్య వంటి వారు తమదైన హాస్యంతో అలరించారు . వారి స్ఫూర్తితో ఎంతోమంది చిత్రసీమలో ప్రవేశించి , నవ్వులు పండించే ప్రయత్నం చేశారు . అందులో కొందరే సఫలీకృతులయ్యారు . అయితే 'బ్రహ్మానందం' కామెడీతో జనానికి కడుపులు చెక్కలు కావడం మొదలయిన తరువాత నుంచీ హాస్యాభినయంపై మమకారం పెంచుకున్న వారెందరో ఉన్నారు . బ్రహ్మానందం చూపిన బాటలో ' మిమిక్రీ ' చేస్తూ హాస్యం పంచవచ్చునని భావించిన వారు తొలుత స్వరఅనుకరణతో జనాన్ని మెప్పించి , తరువాత చిత్రసీమలో రాణించారు . అలాంటివారికి సైతం 'బ్రహ్మానందం' తగిన ప్రోత్సాహమిచ్చారు . ఇక తమ హాస్యనటుల్లో కూడా కథానాయకులుగా రాణించగల దిట్టలు ఉన్నారంటే , వారికీ తగిన ప్రోత్సాహం అందించారు . తమ హాస్యకుటుంబంలోని కొందరు సభ్యులు దర్శకులుగా మారడానికి ఆయన ప్రోత్సాహమే కారణం . అందుకే తెలుగు సినిమా హాస్య చరిత్రలో 'బ్రహ్మానందం'కు ముందు , తరువాత అని రాయాల్సి ఉంటుందని అంటారు .
కనిపిస్తే చాలు ...
'బ్రహ్మానందం' తెరపై నవ్వించి , జనానికి కడుపులు చెక్కలు చేసి , కళ్ళల్లో నీరు తెప్పిస్తాడు . నిజజీవితంలో కన్నీళ్ళను కడుపులోనే దాచుకొని , నవ్వులనే ఇతరులకు పంచిన వైనం కొందరికే తెలుసు . షూటింగులకు సరైన సమయానికి రాడు అనే అపప్రద కూడా ఆయనపై ఉంది . ఎలా వస్తాడు మరి ! ఒకప్పుడు తీరిక లేకుండా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి సినిమాల్లోనూ ఆయన నవ్వుల నావనే సాగేది . దానిని అటు , ఇటు పయనం కట్టాలంటే , కాసింత ఆలస్యమవుతుంది మరి . దీనిని కాదనేవారెవరు ? మొన్నటి దాకా తీరిక లేకుండా నవ్వులు పండించిన ఈ హాస్యనటబ్రహ్మ , కరోనా కల్లోలంలో ఇంటిపట్టునే ఉండి తనలోని ఇతర కళలను బయట పెట్టారు . చిత్రలేఖనంలో 'బ్రహ్మానందం' బాణీ చూసి నిత్య చిత్రకారులు సైతం నివ్వెర పోయారు . 'బ్రహ్మానందం' ఉంటే చాలు అనుకొనేవారు ఆయన తమ చిత్రాల్లో ఉండాలని కోరుకుంటున్నారు . ఆయనకు మునుపటిలా అవకాశాలు లేవని కొందరు భావించవచ్చు . ఇంకా అవకాశాల వెంట పరుగులు తీసే స్థాయిలో ఆయన లేరు . గత సంవత్సరం సూపర్ డూపర్ హిట్ గా నిలచిన ' అల వైకుంఠపురములో ' చిత్రం " రాములో రాములా .... " పాటలో కొన్ని క్షణాల పాటు మెరిశారు . ఆ మెరుపునే చూసి గతంలో 'బ్రహ్మానందం' పంచిన నవ్వులను గుర్తు చేసుకున్నారు జనం . ఆయన నవ్వులు కేవలం తెలుగువారినే కాదు , తెలుగు అర్థం కాని వారినీ అలరించాయి . 'బ్రహ్మానందం' హాస్యాభినయం చూసి పరభాషల వారు సైతం కితకితలకు గురవుతున్నారంటే అతిశయోక్తి కాదు . ఇంతలా నవ్వులు పూయించిన , ఇంకా పూయంచడానికి సిద్ధంగా ఉన్న బ్రహ్మానందం మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం .

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.