దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న యువతిని అతి దారుణంగా చంపిన వ్యక్తి.. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ముంబైకి చెందిన అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు కాల్ సెంటర్లో పనిచేసే 26 ఏళ్ల శ్రద్ధా అనే యువతి పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారి అతనితో సహ జీవనం చేస్తోంది. వీరి బంధాన్ని ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడం వల్ల ఇద్దరూ ముంబయి నుంచి ఢిల్లీకి పారిపోయి.. మెహ్రౌలీ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో ఉంటున్నారు. పెళ్లి విషయంలో తరచూ జరిగే గొడవలు తీవ్రమై మే 18న శ్రద్ధాను అమీన్ హత్య చేశాడు.
తర్వాత మృతదేహాన్ని 35 ముక్కలు చేసి వాటిని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు. 18 రోజులపాటు అర్ధరాత్రి 2గంటలకు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాటిని విసిరేసి.. మృతదేహం జాడ లేకుండా చేశాడు.శ్రద్ధా ఫోన్ ఎత్తకపోవడం వల్ల ఆమె కుటుంబసభ్యులకు అనుమానం మొదలైంది. ఈనెల 8న శ్రద్ధా తండ్రి ఢిల్లీలో వారు నివసించే ఫ్లాట్‌కు వెళ్లగా తాళం వేసి ఉంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అమీన్‌ను అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. పదేపదే పెళ్లిచేసుకోవాలని శ్రద్ధా ఒత్తిడి చేయడం వల్లే హత్య చేసినట్లు వివరించాడు. ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్న పోలీసులు అమీన్ ఇచ్చిన సమాచారంతో మృతదేహం ఆనవాళ్ల కోసం గాలిస్తున్నారు.