సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి దిన పత్రిక, సాక్షి టీవీకి టీడీపీ నేతలు బులుగు మీడియా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీ నేతలపై విషం చిమ్మడమే ప్రధాన ఎజెండాగా ఆ ఛానెల్ వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఇక, ఈ మధ్యకాలంలో సాక్షికి టీవీ9, ఎన్టీవీ కూడా వత్తాసు పలుకుతూ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆ మీడియా ఛానెళ్లపై చంద్రబాబు తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని టీవీ చానళ్ల తీరును తాను జీవితంలో ఎన్నడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అరాచకం, అప్రజాస్వామికం రాజ్యమేలుతోందని, కానీ, విపక్షంపైనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నీలి మీడియాతో పాటు టీవీ9, ఎన్టీవీలను బాయ్ కాట్ చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ చానళ్లు ఇష్టానుసారంగా తమపై విషప్రచారం చేస్తున్నాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
రాష్ట్రం కోసం పోరాడితే ఒప్పుకుంటామని, కానీ ఉన్మాదులకు వత్తాసు పలికితే సహించబోమని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజల కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న ప్రతిపక్షం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టేలా ప్రవర్తిస్తే సహించేది లేదని ఆ చానెళ్లకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం బాగుకోరే ప్రజలందరూ ఈ చానళ్లను బహిష్కరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
వాస్తవానికి చంద్రబాబుకు మీడియా ఫ్రెండ్లీ నేతగా మంచి పేరుంది. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా..మీడియా ప్రతినిధులను చంద్రబాబు చాలా గౌరవిస్తుంటారు. ఈ విషయం పాత్రికేయ మిత్రులు కూడా చెప్పుకుంటుంటారు. గతంలో చంద్రబాబు పాదయాత్రలో పాల్గొన్న మీడియా ప్రతినిధుల భోజన,వసతి సదుపాయాల గురించి స్వయంగా ఆయనే అడిగి తెలుసుకున్నారని చాలామంది జర్నలిస్టులు పలు సందర్భాల్లో చెప్పారు.
అటువంటి చంద్రబాబు కూడా ఆ మూడు చానెళ్ల పేరు పెట్టి మరీ విమర్శించారంటే ఆ చానెళ్ల తీరుతో చంద్రబాబు ఎంత విసిగిపోయారోనని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. చంద్రబాబు పిలుపుతో బాయ్ కాట్ సాక్షి, టీవీ9, ఎన్టీవీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.