టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ మరో బాహుబలి అవుతుందని అంచనాలున్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ పై మంచి హైప్ ఏర్పడింది. అయితే, తాజాగా కర్ణాటకలో ఈ సినిమాపై వివాదం రాజుకుంది. తమ మాతృభాష కన్నడలో ఈ చిత్రాన్ని విడుదల చేయడం లేదంటూ కన్నడిగులు మండిపడుతున్నారు.
అంతేకాదు, #BoycottRRRinKarnataka అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్ ను వరల్డ్ వైడ్గా ఇంగ్లీష్, పోర్చు గీస్, కొరియన్, తుర్కిష్, స్పానిష్ భాషలతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో మార్చి 25న భారీస్థాయిలో విడుదల చేయబోతున్నారు. అయితే, ఈ చిత్రం కన్నడ భాషలో రిలీజ్ కావడం లేదని కన్నడిగులు ఆందోళన మొదలెట్టారు.
కర్ణాటకలో ఈ చిత్రం తెలుగుతో పాటు వేరే భాషల్లో విడుదలవుతోందని, ఆ సినిమా కన్నడ వెర్షన్ విడుదల కానప్పుడు ఇతర భాషల్లోనూ ఆడకుండా కర్ణాటకలో నిషేధం విధించాలని కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలోనూ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిందని, అయినా కూడా ఈ సినిమాను కన్నడ భాషలో విడుడల చేయకపోవడం తమ భాషను అవమానించడమేనని కర్ణాటక ప్రజలు అంటున్నారు. మరి, ఈ వ్యవహారంపై దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్యల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.