2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తి తో విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కుట్రకోణంపై మరింత లోతుగా దర్యాఫ్తు చేయాలని జగన్ తరఫు లాయర్ గతంలో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో జగన్ కు షాక్ తగిలింది. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక, ఈ కేసులో నిందితుడిగా నాలుగేళ్లుగా జైలులో ఉన్న శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఇంకా విచారణ దశలోనే ఉంది.
ఈ క్రమంలోనే ఈ కేసు విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకు బదిలీ అయింది. ఈ నేపథ్యంలోనే నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం తాజాగా నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ కు కోడికత్తిని అందించింది మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అని సలీం సంచలన ఆరోపణలు చేశారు. నేరాన్ని మాత్రం శ్రీనుపై మోపారని ఆరోపించారు. ఎన్ఐఏ కోర్టు విచారణకు జగన్ హాజరైతే అన్ని విషయాలు బయటపడుతాయని చెప్పారు.
ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ గతంలోనే చెప్పిందని, రాజకీయాల కోసమే ఈ కేసును సాగదీస్తున్నారని ఆరోపించారు. కాగా, జగన్ కోర్టుకు వచ్చి ఎన్ఓసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖలో దళిత సంఘాల ఐక్య వేదిక నిర్ణయించింది. అయితే, నిరసన కార్యక్రమం ప్రారంభం కాకముందే దళిత సంఘాల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.