సీపీఎస్ రద్దు వ్యవహారంపై ప్రభుత్వానికి, ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘాలకు మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలకు ముందు పొరపాటున సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చామని, అది ఆచరణ సాధ్యం కానీ హామీ అని ఇప్పుడు తమకు తెలిసిందని సజ్జల, బొత్స వంటి నేతలు నాలుగు కరుచుకుంటున్నారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ఇస్తామంటూ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, సీపీఎస్ రద్దు మినహా తమకు వేరే ఏ ప్రత్యామ్నాయమూ ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులు అంటున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) కు మాత్రమే తాము అంగీకారం చెబుతామని ఉద్యోగులు, ఉపాధ్యాయులు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలోనే బొత్స ఆధ్వర్యంలోని మంత్రులు కమిటీతో కొద్దిరోజుల క్రితం ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జీపీఎస్ గురించి చర్చించేందుకు అయితే తమను చర్చలకు పిలవద్దని ఉద్యోగ సంఘాల నాయకులు తేల్చి చెప్పేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా సీపీఎస్ పై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో సీపీఎస్ పై నిర్ణయం తీసుకుంటామని బొత్స అన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీలలో సీపీఎస్ రద్దు కూడా ఒకటని చెప్పారు. అయితే, ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. సీపీఎస్ పై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము తీసుకోబోయే నిర్ణయం ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు. డిసెంబర్ నాటికి ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని పరిష్కరిస్తామని బొత్స వెల్లడించారు.
అయితే, బొత్స తాజా ప్రకటనతో ఉద్యోగులు,ఉపాధ్యాయులు షాకయ్యారు. త్వరలో తేల్చేయాల్సిన సీపీఎస్ రద్దు అంశాన్ని మరింత నాన్చుతున్నారని వారు మండిపడుతున్నారు. ఇలా అయితే, తాము మళ్లీ ఉద్యమబాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు.
Comments 1