వైసీపీలో పెద్దల సభ టిక్కెట్లు పెద్ద కలవరమే సృష్టించనున్నాయి.ఏ ఒక్కరి పేరు చివరి దాకా నిర్థారణకు నోచుకునేలా లేదు. ఉత్తరాంధ్ర నుంచి బొత్స ఆశించినా కూడా భంగపాటు తప్పలేదు.ఇదే సమయంలో జగన్ ఎప్పటి నుంచో ఓ బీసీ మహిళను రాజ్యసభ కు పంపాలని యోచిస్తున్నారు. అందుకు కృపారాణి పేరును ప్రతిపాదించారు.ఈమె శ్రీకాకుళం జిల్లా నాయకులు.మాజీ ఎంపీ,కేంద్రమంత్రిగా యూపీఏ హయాంలో పనిచేశారు. ఈమె పేరుపై మాత్రం ఎటువంటి వివాదం అయితే లేదు.
జగన్ ఒక్కరే కాదు ఆ మాటకు వస్తే మిగతా అందరి నాయకుల నుంచి కూడా సానుకూలతలే వ్యక్తం అవుతున్నాయి.ఆ విధంగా చూసుకుంటే మొత్తం వైసీపీకి దక్కే నాలుగు టిక్కెట్లలో రెండు మాత్రం కన్ఫం అయ్యాయి.ఒకటి అదానీ గ్రూపునకు కాగా మరొకటి ఉత్తరాంధ్ర మహిళా నేత కృపారాణి. ఆమె కూడా ఈ విషయాన్ని సూచన ప్రాయంగా సన్నిహితుల దగ్గర అంగీకరిస్తున్నారు.త్వరలో తనకు రాజయోగం దక్కనుందన్న ఆశతోనే ఉన్నారు.ఇదే సమయంలో మరికొందరు ఆశావహులు ఉన్నారు.వాళ్లెవ్వరో చూద్దాం.
గత కొద్దికాలంగా స్తబ్దుగా ఉంటున్న విశాఖ పెద్ద సాయిరెడ్డి మళ్లీ అదే ప్రాంతంలో హల్ చల్ చేయడం ప్రారంభించనున్నారు.ఆ మాటకు వస్తే మళ్లీ సీన్ లోకి సాయిరెడ్డి వచ్చి, పార్టీలోనే ఉన్న శత్రువర్గాన్ని నిలువరించనున్నారు.జగన్ దగ్గర మళ్లీ తన మాట నెగ్గించుకుని పెద్దల సభకు వెళ్లనున్నారు.జూన్లో ఖాళీ కానున్ననాలుగు రాజ్యసభ స్థానాలలో ఒకటి సాయిరెడ్డికి కేటాయించారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వైసీపీ కోటాకు గాను నాలుగు సీట్లు రానున్నాయి.అందులో ఒకటి అదానీ గ్రూపు సంస్థలకు కేటాయించారని సమాచారం.ప్రీతీ అదాని (గౌతమ్ అదానీ జీవన సహచరి)కి టికెట్ కన్ఫం అయిందని కూడా తెలుస్తోంది.ఇదే సమయంలో ఆశావహుడిగా ఉన్న బొత్స పేరు కానీ ఆశావహుడిగా ఉన్న అలీ పేరు కానీ వినపడడం లేదు. దీంతో పూర్తి నిరుత్సాహంలోనే బొత్స ఉండిపోయారు.
అదేవిధంగా కొంత కాలంగా ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ పదవి నుంచి సాయి రెడ్డి తప్పుకోవాలని జగన్ చెబుతున్నారు.కానీ ఆయన ససేమీరా అంటున్నారు.ఆయన స్థానంలో సీనియర్ మంత్రి బొత్సను నియమించాలని చూసినా అది కూడా కాలేదు.ఆ విధంగా కూడా బొత్సకు నిరాశే. సాయిరెడ్డి మళ్లీ ఫాంలోకి వస్తే విశాఖ కేంద్రంగా ఉన్న ఆయన అనుకూల వర్గాలన్నింటికీ పండగే పండగ.
ఇక మిగతా ఆశావహుల జాబితాలో సజ్జల రామకృష్ణా రెడ్డి,వైవీ సుబ్బారెడ్డి,మెగాస్టార్ చిరంజీవి, ముద్రగడ పద్మనాభంతో సహా సీమకు చెందిన కొందరు నేతలు,అదేవిధంగా మైనార్టీ కోటాలో ఉన్న ఇంకొందరు నేతలు కూడా ఉన్నారని ప్రాథమిక సమాచారం.జగన్ నిర్ణయం అనుసారం ఆఖరి నిమిషంలో అనూహ్య మార్పులు వస్తే తప్ప సాయి రెడ్డి పేరు జాబితా నుంచి తొలిగే అవకాశమే లేదు అని నిర్థారితం అవుతోంది.
అదేవిధంగా ప్రీతీ అదానీ,కిల్లి కృపారాణి పేర్లు కూడా దాదాపు ఖరారు అయ్యాయనే అంటున్నారు.మొన్న శారదా పీఠంకు వచ్చినప్పుడు కూడా సీఎంను కృపారాణి కలిసి వెళ్లారు.ఆ సందర్భంలో ఇందుకు సంబంధించిన చర్చలేవీ రాకున్నా త్వరలో ఆమెకు పదవి ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి మాత్రం సానుకూల దృక్పథంతోనే ఉన్నారు.అంటే ఇప్పుడు మూడు స్థానాలు ఎవరివి అన్నవి నిర్థారణ అయింది.ఇక మరో టికెట్ ఎవరికి దక్కుతుంది అన్నది తేలాలి.