ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ హీరోగా నిర్మిస్తున్న ‘మైదాన్’ చిత్రం విడుదల తేదీకి రెండు రోజుల ముందు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదల కాబోతుండడంపై బోనీ కపూర్ అసహనం వ్క్తం చేశారు. తమ చిత్రం విడుదల తేదీ ముందుగానే ఫిక్సయిందని, ఆ తర్వాతే రాజమౌళి చిత్రం విడుదల తేదీని ప్రకటించారని బోనీ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజమౌళిపై తాజాగా మరోసారి బోనీ విమర్శలు గుప్పించారు. ఒకే నెలలో 2 రోజుల తేడాతో ఒకే హీరో నటించిన సినిమాలను విడుదల చేయడం దురదృష్టకరమని బోనీ అన్నారు. తాను ఈ విషయంపై రాజమౌళితో ఫోన్లో మాట్లాడానని, అయితే, విడుదల తేదీతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారని బోనీ తెలిపారు. నిర్మాతల ఇష్టప్రకారం విడుదల తేదీ ఫిక్సయిందని రాజమౌళి చెప్పారని, కానీ, ఆయన మాటలను తాను నమ్మడం లేదని బోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ సినిమా విడుదల గురించి అజయ్ దేవగణ్ కు కూడా ముందుగా తెలిసి ఉండకపోవచ్చని బోనీ అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ తోపాటు పలు ఇండస్ట్రీల్లో మంచి పేరున్న రాజమౌళి నుంచి ఇలాంటి చర్యను తాను ఊహించలేదని అన్నారు. కాగా, ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవ్గణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. బోనీ నిర్మిస్తోన్న మైదాన్ లో అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే, మైదాన్ సినిమాను గత ఏడాది విడుదల చేయాలనుకున్నా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిందన్నారు.
మళ్లీ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే తాము మైదాన్ విడుదల తేదీని ప్రకటించామని, కానీ, తమ ప్రకటన తర్వాతే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల ప్రకటన రావడం అనైతికమైన చర్య అని బోనీ కపూర్ అంటున్నారు. మరి ఈ వివాదానికి జక్కన్న ఎలా ఫుల్ స్టాప్ పెడతారన్నది ఆసక్తికరంగా మారింది.