భారత దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికల అంత్యక్రియలు ముగిశాయి. అమరులైన ఈ దంపుతలిద్దరి భౌతికకాయాలను ఒకే చితిపై దహనం చేశారు. బిపిన్ రావత్ అంతిమ యాత్ర భావోద్వేగపూరితంగా సాగింది. దారి పొడవునా ఆర్మీ సిబ్బంది, ప్రజలు పూలవర్షం కురిపించి మృతదేహంతో పాటు త్రివర్ణ పతాకాలతో పరుగులు తీశారు. జనరల్ బిపిన్ రావత్ అమర్ రహే.. అనే నినాదాలతో రహదారులు మారుమోగిపోయాయి.
ఢిల్లీ కాంట్‌లో జరిగిన అంత్యక్రియల్లో జనరల్ బిపిన్ రావత్‌కు 17 తుపాకీలతో సెల్యూట్ చేశారు. ప్రధాని మోడీ, త్రివిధ ఆర్మీ చీఫ్‌లు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జనరల్ రావత్‌కు నివాళులర్పించారు. అతనికి 17 గన్ సెల్యూట్ ఇచ్చారు. ఈ సమయంలో 800 మంది సైనిక సిబ్బంది అక్కడ పాల్గొన్నారు.
అంతకుముందు, రావత్ చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు మాట్లాడిన చివరి మాటలను ఆయనతో మాట్లాడిన వారు గుర్తు చేసుకుంటున్నారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న రావత్ తనను నీళ్లు కావాలని అడిగారని శివకుమార్ అనే ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. అయితే,తన వెంట నీరు తీసుకువెళ్లలేదని, ఆయనకు చివరి నిమిషాల్లో దాహం తీర్చలేకపోయానని అన్నారు.
అయితే, తాను మాట్లాడింది రావత్ తో అని తెలీదని, తర్వాత ఫొటో చూపించినప్పుడు తెలిసిందని అన్నారు. ఆ రోజు రాత్రంతా తనకు నిద్ర పట్టలేదని అన్నారు.తానే బిపిన్ రావత్‌ని అంటూ నెమ్మదిగా పలికారని సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అవే రావత్ మాట్లాడిన చివరి మాటలు అని వెల్లడించారు.
ఇక, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు వాసి సాయితేజ గురించి ఆయన తండ్రి మోహన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రాణాల మీదకు వచ్చే ఉద్యోగం వద్దని, మానుకోవాలని తాను చాలాసార్లు చెప్పానని గుర్తు చేసుకున్నారు. అయితే, సాయితేజను తన వ్యక్తిగత భద్రత సిబ్బందిగా రావత్ నియమించుకున్నారని, రావత్‌ను సాయితేజ కంటికి రెప్పలా చూసుకునేవారని చెప్పారు. తన ఒత్తిడితో.. ఆర్మీ నుంచి వైదొలుగుతానని సాయితేజ చెప్పాడని, అయితే, తానున్నంతవరకూ…సాయిని కూడా ఉండాలని రావత్ చెప్పారని, అందుకే సాయి వైదొలగలేదని మోహన్ పేర్కొన్నారు.