ఏపీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన కాపు నేతలు పార్టీలకతీతంగా భేటీ కావడం సంచలనం రేపుతోంది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణల తాజా భేటీ ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలకు తెర తీసింది. ఈ భేటీలో ఈ ముగ్గురు నేతలు పలు రాజకీయ విషయాలను చర్చించారని తెలుస్తోంది.
ఈ భేటీకి ముందు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంతకాలంగా గంటా వైసీపీలో చేరతారని ప్రచారం జరగడం..ఆ తర్వాత ఆయన జనసేన వైపు చూస్తున్నారన్న పుకార్లు రావడం తెలిసిందే. ఇక, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీంతో, వీరిద్దరూ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని, ఆ క్రమంలోనే కన్నాతో భేటీ అయ్యారని తెలుస్తోంది.
అయితే ఈ ప్రచారాన్ని గంటా ఖండించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహానికి హాజరయ్యామని, అక్కడ వారు కనిపిస్తే మాట్లానని తెలిపారు. ఈ భేటీలో రాజకీయాంశాలు చర్చకు రాలేదని వెల్లడించారు. మరోవైపు, విజయవాడలో గంటా శ్రీనివాసరావుతో టీడీపీ నేత బొండా ఉమా, యడం బాలాజీ సమావేశం కావడం కూడా చర్చనీయాంశమైంది. అయితే, ఇది రాజకీయ భేటీ కాదని బొండా ఉమ క్లారిటీనిచ్చారు.
స్నేహపూర్వకంగా జరిగిన సమావేశాన్ని కొందరు వక్రీకరిస్తున్నాయని బొండా ఉమా అన్నారు. ఆ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, ఓ వివాహానికి వచ్చిన సందర్భంగా తాము కలిశామని అన్నారు. వైజాగ్లో రంగా వర్ధంతికి సంబంధించిన పోస్టర్లను మాత్రమే గంటా ఆవిష్కరించారని, పార్టీ మారే అంశంపై వార్తలను గతంలోనే గంటా ఖండించారని గుర్తు చేశారు. కాపు నాడు ఏ ఒక్కొరికో సంబంధించిన అంశం కాదని, కాపులందిరితో కూడుకున్న అంశమని అన్నారు.