టీడీపీ కీలక నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని వైసీపీ నేతలు రకరకాలుగా పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే లోకేష్ పాదయాత్ర చేస్తున్న ప్రతి చోట జనం పోటెత్తతున్నారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులో కూడా లోకేష్ పాదయాత్రకు భారీగా జనం హాజరయ్యారు.
దీంతో, పాదయాత్రకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు పట్టణంలో పోస్టర్లు వేశారు. దానికి ప్రతిగా టీడీపీ కార్యకర్తలు హూ కిల్డ్ బాబాయ్ అని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో, ఆ ప్లకార్డులను తీసేయాలంటూ లోకేష్ వద్దకు డీఎస్పీ నాగరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, టీడీపీ నేతలను రెచ్చగొట్టేలా వైసీపీ ఫ్లెక్సీలు పెట్టినప్పుడు పోలీసులు ఎక్కడున్నారని లోకేష్ నిలదీశారు. ఆ తర్వాత పాదయాత్ర సందర్భంగా లోకేష్ పై ఒక ఆకతాయి కోడిగుడ్డు విసిరిన ఘటన వివాదానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ మండిపడ్డారు. జగన్ సొంత జిల్లాలో వైసీపీ ఉనికి కోల్పోయిందని, అది తట్టుకోలేక వైసీపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ రౌడీ మూకలు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఆ దాడిని టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు .లోకేష్ పాదయాత్రకు భద్రతను పెంచమని డీజీపీని కోరుతామని తెలిపారు.