కొద్ది రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ ఇరుకు గదిలో ఓ యువతిపై ఆసుపత్రి సిబ్బంది గ్యాంగ్ రేప్ చేసిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ వ్యవహారం రాజకీయ దుమారం రేపడంతో ప్రభుత్వం ప్రతిపక్షంపై బురదజల్లేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ విమర్శలను టీడీపీ తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే ఆ యువతి కుటుంబానికి టీడీపీ రూ.5 లక్షల చెక్కును అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి రోజాపై టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు.
రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని, వనజాక్షి, కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటూ టీడీపీపై విమర్శలు చేయడం ఏంటని బొండా ఉమ నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందని, ఇన్నాళ్లూ ఏం చేశారని ఉమ నిలదీశారు. ఇకనైనా రోజా సొల్లు కబుర్లు, మాటలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ పాలనలో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని జగన్ సర్కార్ లో మంత్రిగా ఉన్న రోజాను నిలదీశారు.
విజయవాడ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి కుటుంబానికి టీడీపీ అండగా ఉందని, అందుకే మహిళా కమిషన్ నుంచి తమకు సమన్లు వచ్చాయని అన్నారు. అసలు మహిళా కమిషన్కు ఉన్న అధికారాల గురించి వాసిరెడ్డి పద్మ చదివారా? అని ఉమ ప్రశ్నించారు. ఆమె రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, ఆ పదవి నుంచి ఆమెను తప్పించాలని సీఎస్, జాతీయ మహిళా కమిషన్ను కోరుతున్నామని ఉమ చెప్పారు.
వాసిరెడ్డి పద్మ మేకప్ వేసుకుని తీర్పులు చెప్పొచ్చని అనుకుంటున్నారేమో అని బొండా ఉమ ఎద్దేవా చేశారు. మహిళా కమిషన్ ఇచ్చిన సమన్ల వల్ల తమ వెంట్రుక కూడా ఊడదని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ గ్యాంగ్ రేప్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, బొండా ఉమలకు ఏపీ మహిళా కమిషన్ సమన్లు జారీ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.