విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మానసిక వికలాంగురాలిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. యువతిని 30 గంటల పాటు ఓ చిన్న గదిలో బంధించి ఆమెపై ఈ అఘాయిత్యానికి తెగబడ్డ వైనంపై ప్రతిపక్ష టీడీపీ మండిపడింది. ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే, ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీరు వివాదాస్పదమైంది.
ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేతలకు పద్మ నోటీసులిచ్చారు. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ గ్యాంగ్ రేప్ ఘటనపై వైసీపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటోందని ఉమ విమర్శించారు. దారుణం జరిగిన 3 రోజుల తర్వాత వాసిరెడ్డి పద్మ పరామర్శకు వచ్చారని బొండా ఉమ ఎద్దేవా చేశారు. మొహానికి మేకప్ వేసుకొచ్చి ఆసుపత్రిలో అబద్ధాలు చెప్పారని షాకింగ్ కామెంట్లు చేశారు.
ఆమె ఒక బజారు మనిషిలా మాట్లాడుతున్నారని ఉమ మండిపడ్డారు. ఆమె ఒరేయ్ అంటే.. తాము ఒసేయ్ అనలేమా? అంటూ ఉమ ప్రశ్నించారు. సీఎం జగన్ ను వాసిరెడ్డి పద్మ రోడ్డున పడేశారని అన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే తమకు నోటీసులిచ్చారని, వ్యక్తిగత కక్షతో ఇచ్చిన నోటీసులకు తాము స్పందించే ప్రసక్తే లేదని చెప్పారు. ఆమెను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగించేంత వరకు తాము న్యాయపోరాటం చేస్తామని తెగేసి చెప్పారు. బాధితులకు అండగా ఉండటమే తమ అధినేత చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
అంతకుముందు, ఈ ఘటన నేపథ్యంలో జగన్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇంత జరిగినా సీఎం జగన్ నేరుగా ఆసుపత్రికి రాకుండా మోసపూరిత సున్నా వడ్డీ పథకం కోసం ప్రకాశం జిల్లా వెళ్లారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ బాధ్యత లేకుండా వ్యవహరించటం వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. గ్యాంగ్ రేప్ సంఘటన ప్రభుత్వానికి అవమానంగా అనిపించట్లేదా అని చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రంలో ఇంకెన్ని మానభంగాలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందో అర్ధం కావడం లేదన్నారు.