జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందని, ఆయనను హత్య చేసేందుకు కొందరు కుట్ర పన్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, పవన్ కళ్యాణ్ హత్యకు దాదాపు 250 కోట్ల రూపాయలకు డీల్ కుదిరిందని, ఆల్రెడీ సుపారీ కూడా ముట్టిందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టిడిపి సీనియర్ నేత బోండా ఉమా స్పందించారు.
పవన్ హత్యకు 250 కోట్ల రూపాయలతో స్కెచ్ వేశారని, రెక్కీ కూడా చేశారని బోండా ఉమ ఆరోపించారు. ఈ కుట్ర వెనుక తాడేపల్లి హస్తం ఉందని అనుమానాలున్నాయని బోండా ఉమ ఆరోపించారు. నిన్న నందిగామ పర్యటన సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్ పై కూడా రాళ్లదాడి జరిగిందని, ప్రశ్నించే వారి ప్రాణాలు తీస్తారా అంటూ జగన్ ను ఉమ ప్రశ్నించారు. చంద్రబాబు కాన్వాయ్ పై నందిగామ ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఎమ్మెల్సీ అరుణ్, వారి ముఖ్య అనుచరులు దాడికి పాల్పడ్డారని, అదృష్టవశాత్తు చంద్రబాబు తప్పించుకున్నారని ఆరోపించారు.
పిచ్చోడి చేతిలో రాయిలాగా జగన్ రెడ్డి పాలన మారిందని, విశాఖ నగరంలో 40,000 కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జా చేశారని ఉమా ఆరోపించారు. ఇక, టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి పోలీసులు దండుపాళ్యం బ్యాచ్ లాగా గోడలు దూకి వెళ్లి ఆడవారిపై దౌర్జన్యం చేసి మరీ అరెస్టు చేశారని ఆరోపించారు. బాత్రూం సైజులో గోడ కట్టారని అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేశారని, కానీ జగన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వక్ఫ్ భూములు కబ్జా చేసి అందులో సినిమా హాలు కట్టినా ఏ చర్యలూ లేవని ఆరోపించారు.
చంద్రబాబుపై జరిగిన హత్యాయత్నంలో నందిగామ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ముద్దాయిలుగా చేర్చి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిర్ణయం ప్రకారం తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని బోండా ఉమ అన్నారు.