వివేకా హత్య కేసులో అసలు దోషులెవరు? వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఈ కేసులో పదే పదే ఎందుకు వినిపిస్తోంది? ఈ కేసు విచారణ జరుపుతున్న సీబీఐ ఏఎస్పీపైనే కేసు పెట్టారట…దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే కేసు పెడితే విచారణ ఎలా సాగుతుంది?..ఈ ప్రశ్నలన్నీ ఏపీలోని జనాల మదిలో మెదులుతున్నవి. ఏ రచ్చబండ దగ్గర చూసినా…ఏ నలుగురు కలిసినా వివేకా మర్డర్ మిస్టరీ గురించే చర్చ. వివేకా మర్డర్ కేసును విచారణ జరుపుతున్న సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ పై కేసు పెట్టడం…ఆయనపై చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఏఫీ హైకోర్టు ఆదేశాలివ్వడంపైనే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ నేత బొండా ఉమ స్పందించారు. ఈ కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారుల భద్రత బాధ్యత ఢిల్లీ పెద్దలదేనని ఉమ అన్నారు. జయలలితపై ఉన్న కేసును వేరే రాష్ట్రం కర్ణాటకలో విచారణ జరిపిన తరహాలోనే..వివేకా హత్య కేసు విచారణను కూడా వేరే రాష్ట్రంలో చేపట్టాలని బొండా ఉమ డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసు నిందితులను కాపాడేందుకు జగన్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను కూడా నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు.
చిన్నాన్న కేసు విచారణ జరుపుతున్న అధికారులపై జగన్ పోలీసులతో కేసులు పెట్టించారని, తాడేపల్లి ఆదేశాలను పాటించని సీబీఐ అధికారులపై కక్ష కట్టారని ఆరోపించారు. సీబీఐ అధికారుల ఫోన్ నెంబర్లను ఏపీ పోలీసుల ద్వారా ప్రభుత్వ పెద్దలు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో వైయస్ అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.