పై ఫొటోలో ఉన్నవి కొబ్బరికాయలో.. తాటికాయలో కాదు.. అచ్చంగా నాటు బాంబులు. ఒక్క బాంబు పేలితే.. పది నుంచి 15 ఇళ్లు ధ్వంసం. అదే భారీ కట్టడమైతే.. కూలిపోవడం ఖాయం. అంత పవర్ ఫుల్గా ఈ నాటు బాంబులను తయారు చేశారట. అయితే.. ఇవి ఎక్కడ దొరికాయంటే.. వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ప్రస్తుతం ఏపీ క్రీడా ప్రాదికార సంస్థ(శాప్)కు చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ముఖ్య అనుచరుడి ఇంట్లో దొరికినట్టు పోలీసులు చెప్పారు. దీంతో కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది.
అయితే.. ఈ బాంబులతో తమకు సంబంధం లేదని సదరు అనుచరుడు చెప్పడం గమనార్హం. దీంతో పోలీసులు ఇప్పుడు ఈ బాంబులను ఎవరు దాచారు? ఎందుకు దాచారు? అసలు వ్యూహం ఏంటి? ఎక్కడ నుంచి తీసుకువచ్చారు? అనే కోణంలో ముందుకు సాగుతున్నారు. ఇక, విషయంలోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడు, సోషల్ మీడియా కన్వీనర్ బోయ మధు నివాసం ఉంటున్నారు. తాజాగా ఆయన ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంకును క్లీన్ చేసేందుకు కొందరు యువకులు దిగారు.
అయితే, ఆ వాటర్(ఓవర్ హెడ్) ట్యాంక్లో రెండు కవర్లలో 22 నాటు బాంబులను వారు గుర్తించారు. దీంతో హడలి పోయిన వారు.. విషయాన్ని బైరెడ్డి అనుచరుడు బోయ మధుకు చెప్పారు. దీంతో ఆయన వెంటనే బైరెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన సూచనల మేరకు ఇదే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు 22 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాటర్ సింటెక్స్లో బాంబులు ఎవరు ఉంచారనే దానిపై దర్యాప్తు చేపట్టారు.
అంతేకాదు.. ఎవరు వీటిని ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే విషయంలో దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కక్షలకు, రాజకీయ ప్రతీకారాలకు ఆలవాలమైన సీమ జిల్లాల్లో నాటు బాంబుల తయారీ.. దీపావళి బాంబుల తయారీ అంత ఈజీనే అయినా.. కొన్నాళ్లుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, నూతన చట్టాల కారణంగా వాటికి తెరపడింది.