ఎముకలు కొరికే చలిలో పెద్దగా మాట్లాడటం.. గట్టిగా శ్వాస పీల్చినా ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే చాలామంది ఎందుకు ఉంటుంది? అన్న మాటను చెబుతారు.కానీ.. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తూ కర్రపెత్తనం చేసే అమెరికాకు తాజాగా ప్రకృతి భయంకరమైన గిప్టును ఇచ్చింది. క్రిస్మస్ వేళ.. అమెరికాను పట్టేసిన బాంబ్ సైక్లోన్ దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. అంత చలిలోనూ బాంబ్ సైక్లోన్ గురించి వివరాల్ని వింటున్న వారు టెన్షన్ తో చెమటలు పట్టే పరిస్థితి.
చలికాలంలో వణికించే చలి.. గజగజలాడే శీతల గాలులు మామూలే. కానీ.. అదెంత ఎక్కువగా ఉంటుందంటే.. క్షణాల్లో మనిషిని సైతం గడ్డ కట్టేసే దారుణమైన చలి ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. ఈ విపత్తుపై తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడన్ మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికన్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శీతాకాలపు తుపాను బాంబ్ సైక్లోన్ వేగంగా వచ్చేందుకు సిద్ధమవుతున్న వేళ.. క్రిస్మస్ వేడుకల కోసం కుటుంబాలను కలవాలనుకునే వారు.. ఫ్రెండ్స్ తో కాలం గడిపేందుకు ప్లాన్ చేసుకున్న వారు వెంటనే బయలుదేరాలని స్పష్టం చేశారు.
మంచు తుపాను మరింత బలం పుంజుకొని బాంబ్ సైక్లోన్ గా మారే అవకాశం ఉందన్న ఆయన మాటలు అమెరికన్లకు కలవరానికి గురి చేస్తున్నాయి. మరోవైపు వాతావరణ శాఖ ఇస్తున్న సమాచారం చూసినప్పుడు.. అమెరికాలో చలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేయొచ్చు. ప్రస్తుతం ఆ దేశంలో మైనస్ 39 డిగ్రీల సెల్సియస్ కు మెర్క్యురీ మీటర్లు పడిపోతున్నాయి.
విపరీతమైన చలి.. దీనికిమించిన హిమపాతం.. చల్లని గాలులతో ఉక్కిరిబిక్కిరి చేసేలాంటి పరిస్థితి. గడిచిన నలభై ఏళ్లలో ఇలాంటి గడ్డు పరిస్థితి లేదంటున్నారు. మంచు తుఫాను కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఒక.. ఈ తీవ్రమైన మంచు తుపాను కారణంగా గట్టిగా మాట్లాడినా.. బలంగా శ్వాస తీసుకున్నా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.
ఇంతకూ బాంబ్ సైక్లోన్ అంటే.. మధ్య అక్షాంశ తుపాను. దీనిలో కేంద్ర పీడనం గంటకు ఒక మిల్లీ బార్ వద్ద కనీసం 24 గంటల పాటు వేగంగా పడిపోతుంది. ఈ పీడనం ఎంత తక్కువగా ఉంటే తుపాను అంత బలంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ఉష్ణోగ్రతలు ఇప్పుడున్న దాని కంటే 11 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవచ్చని చెబుతున్నారు.
ఇంతకీ ఈ బాంబ్ తుపాను ఎలా ఏర్పడుతుందన్నది చూస్తే.. వివిధ రకాల వాయు ద్రవ్యరాశి గాల్లో కలిసినప్పుడు వెచ్చని గాలి పెరిగే కొద్దీ.. గాలి ఒత్తిడిని తగ్గించే క్లౌడ్ వ్యవస్థ క్రియేట్ అవుతుంది. అల్పపీడన ప్రాంతం చుట్టూ అపసవ్య దిశలో ప్రసరించే తుఫానుగా ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ తుఫాను వేళ గట్టిగా గాలి పీల్చినా.. గట్టిగా మాట్లాడినా ఆ చలికి తెమడ పట్టేసి ప్రాణాల్ని తీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
తాజాగా బైడెన్ మాట్లాడుతూ.. ఈ మంచు తుపాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే.. పరిస్థితి ఎంత ప్రమాదకరమన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. ‘‘ఇది అపాయకరమైనది. మీరు చిన్నతనంలో చూసిన మంచు తుపాను లాంటిది కాదు. ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేసేది. తీవ్రమైన వాతావరణం ఓక్లహామా నుంచి వ్యోమింగ్.. మైనే వరకు సాగుతుంది. వాతావరణ శాఖ చేసే హెచ్చరికల్ని ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి. ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు’’ అని కోరటం గమనార్హం.