ప్రస్తుతం ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగోతన్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా…డార్క్ హార్స్ లా కలెక్షన్ల రేసులో దూసుకుపోతోంది. సుమారు 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది. తాజాగా శనివారం నాడు కలెక్షన్లతో ఈ చిత్రం బాహుబలి-2 తరహాలో రికార్డుకలెక్షన్లతో దూసుకుపోతోంది.
ఇప్పటిదాకా సినిమా రూ.141.25 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం త్వరలోనే రూ.150 కోట్ల మార్క్ ను దాటేస్తుందని ట్రేడ్ నిపుణుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఈ చిత్రం తొమ్మిదో రోజు వచ్చిన రూ.24.8 కోట్లు వసూళ్లే అత్యధికం అని ఆయన చెప్పారు. ఒకే ఒక్క గుర్రం పందెంలో దూసుకెళ్తున్నట్టు అనిపిస్తోందని, రెండోవారాంతంలో బాహుబలి–2లా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోందని ట్వీట్ చేశారు. 10వ రోజైన ఇవాళ రూ.28 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. సోమవారం నాటికి సినిమా వసూళ్లు రూ.175 కోట్ల మార్క్ ను తాకే అవకాశముందని అంచనా వేశారు.
మరోవైపు, ఈ చిత్రం చూసి వస్తున్న పశ్చిమ బెంగాల్ ఎంపీ, బీజేపీ నేత జగన్నాథ్ సర్కార్ కారుపై బాంబు దాడి జరిగిందన్న ఘటన కలకలం రేపుతోంది. తాను ‘ది కశ్మీర్ ఫైల్స్’ చూసిన అనంతరం ఇంటికి వెళ్తుండగా కొందరు దుండగులు తన కారుపై బాంబు దాడి చేశారని ఆయన ఆరోపించారు. నదియా జిల్లాలోని హరింఘటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దర్శకుడు వివేక్ అగ్ని హోత్రికి వై కేటగిరీ భద్రత కల్పించారు.