ఒకప్పుడు దక్షిణాదిన తమిళ సినిమాల ఆధిపత్యం ఏ స్థాయిలో ఉండేదో తెలిసిందే. కానీ ఇప్పుడు రోజులు మారాయి. తెలుగు సినిమా ఇంతింతై అని ఎదిగిపోయి ప్రపంచ స్థాయికి చేరింది. తమిళ చిత్రాలు సమీప భవిష్యత్తులో ఆ స్థాయిని అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించడం తమిళులకు ఎంత మాత్రం రుచించలేదు అనడంలో సందేహం లేదు. ఈ విషయం పలు సందర్భాల్లో బయటపడిపోయింది. సోషల్ మీడియాలో తమిళ నెటిజెన్లు అదే పనిగా మన సినిమాలను, మన ఫిలిం మేకర్లను టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం.
అయితే సాధారణ అభిమానులు ఈ పని చేయడం వేరు. ఫిలిమ్ సెలబ్రిటీలు, మీడియా వాళ్లు సైతం ఇలా అక్కసు వెళ్ళగక్కడం వేరు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన కొన్ని తెలుగు సినిమాలపై విషం కక్కిన తమిళ జనాలు ఇప్పుడు యానిమల్ మూవీని టార్గెట్ చేసుకున్నారు. ఇది బాలీవుడ్ మూవీనే అయినప్పటికీ దాన్ని తీసింది తెలుగువాడైన సందీప్ రెడ్డి వంగ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మెజారిటీ తమిళ క్రిటిక్స్, నెటిజన్లు డీగ్రేడ్ చేయడానికే చూస్తున్నారు. తాజాగా సిద్ధార్థ నుని అనే పేరున్న సినిమాటోగ్రాఫర్ సైతం ఈ సినిమాను టార్గెట్ చేశాడు. ఈ చిత్రంలో మహిళల మీద పురుషాధిక్యత గురించే కాక అనేక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అతను పోస్ట్ పెట్టాడు.
కానీ కలెక్షన్ల ప్రస్తావన తేవడం చూస్తే.. నిర్మాణాత్మక విమర్శ చేయడం కంటే ఏదో అక్కసు వెళ్ళగక్కినట్టే అనిపించింది చాలామందికి. ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే.. సిద్ధార్థ కొన్నేళ్ల కిందట నాన్ బ్రాహ్మణ్ అనే సినిమాకు ఛాయగ్రహణం అందించాడు. యానిమల్ లో అతను అభ్యంతరకరం అని చెప్పిన సన్నివేశాలతో పోలిస్తే.. అందులోని సీన్లు చాలా ఎబ్బెట్టుగా, వివాదాస్పదంగా ఉంటాయి. వాటి మీద అప్పట్లో దుమారం రేగింది కూడా. మరి తాను పనిచేసిన సినిమా విషయంలో లేని అభ్యంతరం ఇప్పుడు వచ్చిందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా తెలుగు సినిమాల ఎదుగుదలను చూసి ఏడవడం తప్ప మరొకటి కాదనే అభిప్రాయాలను మన ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.