పోయినేడాది కరోనా మహమ్మారి ధాటికి మొత్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కుదేలైంది. ఏడు నెలల పాటు థియేటర్లలో సినిమాలే నడవలేదు. పున:ప్రారంభం తర్వాత కూడా కొంత కాలం థియేటర్లు వెలవెలబోయాయి.
మార్చిలో మూతపడ్డ థియేటర్లు.. మళ్లీ జనవరి వచ్చాక కానీ పుంజుకోలేదు. ఆ సమయానికి ఇటు తెలుగులో, అటు తమిళంలో మళ్లీ కొత్త సినిమాల సందడి నెలకొంది.
సంక్రాంతి టైంలో టాలీవుడ్ పుంజుకున్న తీరు అసాధారణం. 50 శాతం ఆక్యుపెన్సీలోనే ‘క్రాక్’ మూవీ బ్లాక్‌బస్టర్ అయింది. మిగతా సినిమాలు కూడా బాగానే ఆడాయి.
ఇక ఆ తర్వాత టాలీవుడ్ వెనుదిరిగి చూసుకోలేదు. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఉప్పెన, జాతిరత్నాలు లాంటి బ్లాక్బస్టర్లు.. జార్జిరెడ్డి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లాంటి హిట్లు అందుకుంది. ఇక ఏప్రిల్‌లో ‘వకీల్ సాబ్’ సందడీ చూశాం.టాలీవుడ్‌ను చూసి ఆ టైంలో వేరే ఇండస్ట్రీలు అసూయ చెందే పరిస్థితి వచ్చింది.
ముఖ్యంగా కరోనా దెబ్బ నుంచి బాలీవుడ్ ఎంతకీ కోలుకోలేదు. అక్కడ లాక్ డౌన్ తర్వాత ఏవో కొన్ని సినిమాలు నామమాత్రంగా రిలీజయ్యాయంతే.
ఇక సెకండ్ వేవ్ వచ్చాక మళ్లీ దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. టాలీవుడ్, కోలీవుడ్ లాంటి ఇండస్ట్రీలు మధ్యలో అయినా ఉపశమనం పొందాయి కానీ.. బాలీవుడ్‌కు ఆ అవకాశం లేకపోయింది. హిందీ పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది.
ఐతే కరోనా సెకండ్ వేవ్ తర్వాత మాత్రం హిందీ చిత్రాలకు పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ వేవ్ తర్వాత మాదిరి స్తబ్దుగా ఉండిపోకుండా ఈసారి బలంగా పుంజుకోవాలని బాలీవుడ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగానే బాలీవుడ్‌కు కేంద్రమైన ముంబయిలో థియేటర్లను వెంటనే తెరిచేశారు. పాత సినిమాలను నడిపిస్తున్నారు.
భారీ కొత్త చిత్రాల విడుదలకు సన్నాహాలు కూడా మొదులపెట్టేశారు. జులై నుంచి థియేటర్లు పూర్తి స్థాయిలో నడిచే అవకాశాలు కనిపిస్తుండగా.. అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ ఆ నెల 27న విడుదల చేయడానికి నిర్ణయించారు.
ఈ సినిమాతోనే బాలీవుడ్ రీస్టార్ట్ అయ్యేలా ఉంది. ఆ తర్వాత వరుసగా 83, సూర్యవంశీ, తలైవి లాంటి భారీ చిత్రాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గత ఏడాదిలా వేచి చూసే ధోరణి లేకుండా బాలీవుడ్‌ను రివైవ్ చేయడానికి దూకుడుగా వెళ్లాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అదే సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ మాత్రం ఆచితూచి వ్యవహరించేలా కనిపిస్తున్నాయి.