బాలీవుడ్ సీనియర్ నటుడు కన్నుమూశారు. పలు సినిమాల్లో సహాయక పాత్రలు పోషించే ఆయన సుపరిచితమే కానీ.. ఆయన పేరు చాలామందికి తెలీదు. ఆయనే.. అనుపమ్ శ్యాం. 63 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్యానికి గురై తాజాగా కన్నుమూశారు. కిడ్నీ ఇన్ఫెక్షన్.. పలు అవయువాలు వైఫ్యల్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
మూడు దశాబ్దాల తన సినీ ప్రయాణంలో ఆయన పలు సినిమాల్లో నటించారు. ఆయన్ను చూసినంతనే సత్య.. దిల్ సే.. లగాన్.. స్లమ్ డాగ్ మిలియనీర్.. బండిట్ క్వీన్ చిత్రాల్లో ఆయన నటించిన పాత్రలు గుర్తుకు వస్తాయి. అంతేకాదు.. మన్ కీ అవాజ్.. ప్రతిజ్ఞ లాంటి టీవీ షోలలోనూ నటించారు.
నటన విషయంలో ఆయనకున్న కమిట్ మెంట్ చాలా తక్కువమందిలో మాత్రమే చూడగలరు. హైబ్లడ్ షుగర్‌తో బాధ పడుతున్న అనుపమ్ ఇంజెక్షన్లు తీసుకొని మరీ యశ్ పాల్ శర్మతో కలిసి తన చివరి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇదే విషయాన్ని ఆయనకు సన్నిహిత స్నేహితుడు యశ్ పాల్ శర్మ వెల్లడించారు. తాజాగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి ఆయన కన్నుమూశారు. సీనియర్ నటుడు ఒకరు మరణించిన వైనం బాలీవుడ్ లో విషాదాన్ని మిగిల్చింది.