గవర్నర్ పై రాష్ట్రప్రభుత్వం వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఒక బిల్లును రెడీ చేయగానే వెంటనే దానిపై సంతకాలం కోసం వేలాది ఉద్యోగులను ప్రభుత్వం ఉసిగొల్పిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిసైడ్ చేసింది. వెంటనే దీనికి సంబంధించిన బిల్లును రెడీచేసి సంతకం కోసం రాజ్ భవనకు పంపింది. గవర్నర్ తమిళిసై సంతకం అయితే కానీ బిల్లు చట్టంరూపంలోకి రాదు. బిల్లును ప్రభుత్వం రాజ్ భవన్ కు పంపిందో లేదో మరుసటిరోజే ఉద్యోగులంతా రాజ్ భవన్ మీద పడ్డారు.
దేనికంటే గవర్నర్ పై మానసికంగా ఒత్తిడి తెచ్చి ఫైలుపై సంతకం చేయించుకోవటానికి. ఈ పద్దతి గతంలో ఎప్పుడూ లేదు. ఒక బిల్లు ప్రభుత్వం నుండి గవర్నర్ దగ్గరకు వెళితే దాన్ని పరిశీలించి ఏవైనా అనుమానాలు, అభ్యంతరాలుంటే గవర్నర్ ఆ ఫైలును తిప్పి పంపుతుంది. అప్పుడు ప్రభుత్వం గవర్నర్ లేవనెత్తిన అనుమానాలు, అభ్యంతరాలను క్లియర్ చేస్తుంది. ఆ తర్వాత దానిపై సంతకం పెట్టాలా వద్దా అని గవర్నర్ నిర్ణయించుకుంటారు. ఇదంతా ఎప్పుడూ జరిగే ప్రక్రియే.
కానీ ఇపుడు మాత్రం బిల్లును గవర్నర్ దగ్గరకు పంపగానే వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు రాజ్ భవన్ దగ్గర ఆందోళన చేయటం ఏమిటో అర్ధంకావటంలేదు. అంటే గవర్నర్ ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి సంతకం పెట్టించుకోవాలన్నది ఉద్యోగుల ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే వీళ్ళ ప్రయత్నాలకు గవర్నర్ లొంగకుండా బిల్లుపై తన అనుమానాలను, అభ్యంతరాలను చెబుతు ప్రభుత్వానికి తిప్పిపంపింది.
బిల్లులో గవర్నర్ లేవనెత్తిన అనుమానాలు, అభ్యంతరాలకు ప్రభుత్వం సరైన క్లారిటి ఇస్తే అప్పుడు గవర్నర్ సంతకం పెట్టాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటారు. గతంతో ఎంఎల్సీ కోటాలో కౌశిక్ రెడ్డిని నియమిస్తు ఫైలును రాజ్ భవన్ కు పంపితే గవర్నర్ సంతకం పెట్టడానికి అంగీకరించలేదు. ఎందుకంటే అప్పటికే కౌశిక్ పై అనేక కేసులున్నాయి. దాంతో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య పెద్ద వివాదమే రేగింది. అయినా గవర్నర్ వెనకాడలేదు. దాంతో చేసేదిలేక ప్రభుత్వమే ఎంఎల్సీ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. కాబట్టి ఇపుడు కూడా ప్రభుత్వం తొందరపడకుండా ఉంటే పనులవుతాయి. లేకపోతే సాధ్యంకాదు.