సీఎం జగన్ కు నలుపు రంగు అంటే గిట్టదా? నల్ల జెండాలే కాదు నలుపు రంగు చున్నీలు చూసినా సరే జగన్ హైరానా పడిపోతున్నారా? నిరసన జరగకపోయినప్పటికీ నలుపు రంగు దుస్తులు కనిపిస్తే చాలు జగన్ వణికిపోతున్నారా? అనే ప్రశ్నలకు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా సీఎం జగన్ నరసాపురం పర్యటన సందర్భంగా నల్ల చున్నీలు ధరించి వచ్చిన మహిళలను గేటు దగ్గర నిలిపివేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆ చున్నీలు ఉన్న వారికి నో ఎంట్రీ అంటూ బలవంతంగా తీయించి వేయడంపై మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న చున్నీలను గేటు దగ్గరే పడేయడం సంచలనం రేపుతోంది. ఇక, వర్షం పడే సూచనలు ఉండటంతో కొందరు మహిళలు నల్లగొడుగులు తెచ్చుకున్నారు. అయితే గేటు దగ్గరే గొడుగులను స్వాధీనం చేసుకొని అవి ఇస్తే గాని లోపలికి వారిని అనుమతించలేదు.
దీంతో చాలామంది మహిళలు ఇంటికి వెళ్ళిపోయారు. జగన్ మాట్లాడుతున్న సమయంలో నల్ల గొడుగులు, నల్ల చున్నీలు, నల్ల దుస్తులతో నిరసన వ్యక్తం చేస్తారన్న భయంతోనే వాటిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పడం గమనార్హం. అయితే, నల్ల రంగు ఫోబియా, ఈ నిరసన భయం జగన్ కు ఉందని ఆయన ఆదేశాలను పోలీసులు పాటించారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.