మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలన్నది బీజేపీ ప్లాన్. అందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించేందుకైనా కమలం పార్టీ నేతలు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఉప ఎన్నికల్లో గెలుపు అంతటి ప్రతిష్టాత్మకంగా మారింది. మరి గెలుపుకోసం బీజేపీ ఎలాంటి ప్లాన్ వేసింది ? జూనియర్ ఎన్టీయార్, నితిన్, మిథాలీరాజ్ ను కలవటం ఇందులో భాగమేనట. హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ జరిగిన విషయం తెలిసిందే.
వీరిద్దరి భేటీలో ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కానీ వాళ్ళ మధ్య జరిగిన డిన్నర్ మీటింగ్ మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉందట. అలాగే వీళ్ళభేటీపై జనాల్లో కూడా చర్చ జరిగిందట. మునుగోడు ఉపఎన్నికలో జూనియర్, నితిన్ తో ప్రచారం చేయించుకోవాలని బీజేపీ అనుకుంటోందనే విషయంపై జనాల్లో బాగా చర్చ జరుగుతోందట. వాళ్ళు ప్రచారం చేస్తారో లేదో తెలియదు కానీ ఆ ప్రచారంపై జనాల్లో చర్చ జరగటమే బీజేపీకి కావాల్సిందట.
అంటే జనాల్లో బీజేపీ గురించి చర్చజరగటమే కావాల్సిందైతే బీజేపీ సక్సెస్ అయినట్లే అనుకోవాలి. అయితే ఇలాంటి చర్చల వల్ల, సోషల్ మీడియాలో బీజేపీపై చర్చ ట్రెండింగ్ లో ఉన్నంత మాత్రాన మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిచిపోతుందా ? అన్నదే అసలైన ప్రశ్న. నిజానికి బీజేపీది చాలా చవకబారు ఎత్తుగడనే చెప్పాలి. పదిమంది తమ పార్టీగురించి చర్చించుకున్నంత మాత్రాన ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓట్లేస్తారని అనుకుంటే పొరబాటనే చెప్పాలి.
ఎన్నికలో ఒక అభ్యర్ధి గెలవాలంటే ఎన్నో సమీకరణలు కలిసిరావాలి. బీజేపీ అభ్యర్ధి గెలవాలంటే ముందు కేసీయార్ పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకతుండాలి. అలాగే ఆ వ్యతిరేకతంతా బీజేపీకి మాత్రమే అనుకూలంగా మారాలి. పోటీలో మరో గట్టిపార్టీ ఉండకూడదు. అన్నింటికిమించి కేసీయార్ వ్యతిరేకతను ఓట్లరూపంలో మార్చుకోగలిగిన యంత్రాంగం బీజేపీకి ఉండాలి. ఈ పాయింట్లన్నీ మునుగోడులో బీజేపీకి ఉన్నాయా ? అన్నదే అసలు పాయింట్.