ఏపీలో ఏమాత్రం బలం లేకపోయినా.. కనీసం 1 శాతం ఓటు బ్యాంకు లేకపోయినా.. బీజేపీతో 49 శాతం ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ చేతులు కలిపింది.
అంతేకాదు.. తాము పక్కాగా గెలుస్తామని తెలిసి కూడా.. రాజమండ్రి, అనకాపల్లి, నరసాపురం, రాజం పేట వంటి బలమైన పార్లమెంటు స్థానాలను కూడా పొత్తులో భాగంగా ఆ పార్టీకి త్యాగం చేశారు.
ఇక, ఈ పొత్తులు కూడా అంత తేలికగా ఏమీ కుదరలేదు.
మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి.. బీజేపీ అగ్రనేతల అప్పాయింట్ మెంట్ కోసం వేచి చూశా రు.
ఈ క్రమంలో ఏపీలో అధికార పక్షం వైసీపీ నేతల నుంచి వచ్చిన బలమైన విమర్శలను కూడా చంద్రబాబు తట్టుకున్నారు.
మరి ఇంతగా ఏరికోరి.. పొత్తు పెట్టుకుని, సీట్లు పంచి.. తన పార్టీ నాయకులకు కూడా అన్యాయం చేసి.. వారితోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నది ఎందుకు?
ఈ పొత్తు పరమార్థం ఏంటి? బీజేపీ తనను గెలిపిస్తుందనా? లేక.. తమకు లేని ఓటు బ్యాంకును బీజేపీ తెచ్చిపెడుతుందనా?
అంటే కానేకాదు.. ఎన్నికల వేళ తమ వాహనాలను పదే పదే ఆపకుండా చేయడం.. పోలీసుల నిర్బంధాల నుంచి తమను కాపాడుకోవడం.. తమ వారికి బెదిరింపులు, హత్యలు ఎదురు కాకుండా చూడడం వంటి కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకునే చంద్రబాబు ఇలా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.
తాను నష్టపోయినా.. పార్టీని గెలిపించుకో వాలని ఆయన భావించేపార్టీలో మెజారిటీ నేతలకు ఇష్టం లేకపోయినా.. చేతులు కలిపారు.
అంతేకాదు.. బీజేపీకి చెందిన నేతలకు ఇతర రాష్ట్రాల్లో టికెట్లు దక్కక పోతే.. వారి అభ్యర్థన మేరకు ఏపీలో టీడీపీ నేతలను కూడా పక్కన పెట్టి వారికి టీడీపీ టికెట్లు ఇచ్చారు.
ఇంత చేసినా.. బీజేపీ తొండాట ఆడుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
క్షేత్రస్థాయి లో జరుగుతున్న పరిణామాలు.. తమ నేతల వరుస హత్యలు.. దారుణాలు, పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుండడంపై టీడీపీ నేతలు నివ్వెర పోతున్నారు.
అంతేకాదు.. వైసీపీని ఎదిరించి.. నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిన రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వాలన్న చంద్రబాబు అభ్యర్థనను కూడా బీజేపీ తోసిపుచ్చింది.
ఆయనను అసలు పట్టించుకోవడమే లేదు.
ఇక, నారా లోకేష్ వాహనాలు రోజుకు నాలుగు సార్లు తనిఖీలు చేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత.. ఇప్పటికి(సోమవారం కూడా) నలుగురు టీడీపీ నాయకులు దారుణ హత్యలకు గురయ్యా రు.
ఇక, స్వేచ్ఛగా నాయకులు ప్రచారం చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
ఇలాంటి పరిణామాలను గమనిస్తున్న టీడీపీ నాయకులు బీజేపీ ఏం చేస్తోంది?
తమతో చేతులు కలిపి.. వేరేవారు చెప్పినట్టు ఆడుతోందా? మనసులో ఒకటి పెట్టుకుని.. పైకి వేరే వ్యూహాన్ని అమలు చేస్తోందా? అని నిప్పులు చెరుగుతున్నారు.
ఇలాంటి పరిస్థితి ఉండకూడదనే కదా.. టీడీపీ త్యాగాలకు సిద్ధపడి మరీ పొత్తులు పెట్టుకుంది… అని నాయకులు అంటున్నారు.
చంద్రబాబు పైకి అనకలేక పోయినా.. నాయకులు మాత్రం అంటున్నారు.
మరి దీనిపై బీజేపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.