2019 ఎన్నికలకు ముందు వైసీపీతో బిజెపికి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కేంద్రంలోని పెద్దల అండతో, సహాయ సహకారాలతో జగన్ అధికారంలోకి వచ్చారు. మూడేళ్ల పాటు ముచ్చటగా ఈ మైత్రి బంధం బాగానే కొనసాగింది. అయితే, గత ఏడాది నుంచి వైసీపీ, బీజేపీల మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక, తాజా పరిణామాలను చూస్తుంటే ఆ గ్యాప్ మరింత పెరిగిందని, దాదాపుగా వైసీపీకి బిజెపికి కటీఫ్ అయ్యే పరిస్థితిలు వచ్చాయని అర్థమవుతుంది.
కానీ, అధికారికంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టుగా వైసీపీ నేతలెవరు ప్రకటనలు చేయడంగానీ, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడంగానీ జరగలేదు. కానీ, బిజెపి నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వంపై, జగన్ పనితీరుపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ తీరుని ఎండగడుతూ వైసీపీపై బిజెపి చార్జిషీట్ కమిటీ వేయడం సంచలనం రేపింది. జగన్ చెప్పిన అబద్దాలను ప్రజలలోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ కమిటీని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు నియమించారు.
11 మందితో కూడిన ఈ కమిటీ మార్గదర్శకులుగా మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళ నేత దగ్గుబాటి పురందేశ్వరి, మరో బిజెపి నేత వై.సత్యకుమార్ లను సోము నియమించారు. ఈ కమిటీ కన్వీనర్ గా పీవీఎన్ మాధవ్ ను, సభ్యులుగా సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు తదితరులను సోము నియమించడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై ఈ కమిటీ దృష్టి సారిస్తుందని సోము వెల్లడించారు.