తెలంగాణలో ఎన్నికల వాతావరణ రోజురోజుకూ హీటెక్కుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు తమ అభ్యర్థుల జాబితా ప్రకటనపైనా తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. తాజాగా కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఇప్పుడిక రాష్ట్రంలో అభ్యర్థులను ప్రకటించే విషయంలో మిగిలిన ప్రధాన పార్టీ బీజేపీ.
ఇప్పటికే ఈ విషయంలో బీజేపీ ఆలస్యం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పుడు కూడా అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు ఆ పార్టీకి మరికొన్ని రోజుల సమయం పట్టనుందని తెలిసింది. బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో లేటు వెనుక ప్రధానంగా రెండు కారణాలున్నట్లు తెలుస్తోంది. ఒకటి బీజేపీలోని అసంత్రుప్త వర్గం. మరొకటి సామాజిక సమీకరణాలను ద్రుష్టిలో ఉంచుకోవడం. బీజేపీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయ శాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ తదితరులు ఇటీవల రహస్య సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా మోదీ సభల్లోనూ వీళ్లు కనిపించ లేదనే చెప్పాలి. దీంతో ఇప్పుడు సీట్ల కేటాయింపుల్లో వీళ్లకు తగిన ప్రాధాన్యత దక్కక పోతే పార్టీ మారే ప్రమాదం ఉందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చేరికలు లేకపోగా ఉన్న నాయకులు కూడా పోతే అది పార్టీకి తీవ్ర నష్టం చేసేదే. మరోవైపు మొదట 38 మంది అభ్యర్థుల జాబితాతో అధిష్ఠానానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతిపాదన పంపించారు.
అయితే, దీనిపై చర్చించేందుకు అధిష్ఠానం సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడిక నామినేషన్లకు 20 రోజులే గడువు ఉన్న నేపథ్యంలో వీలైనంత మంది అభ్యర్థులతో ఎక్కువ స్థానాలకు జాబితా ప్రకటించాలని బీజేపీ చూస్తోందని టాక్. ఇందులో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోందని తెలిసింది. సామాజిక సమీకరణాలను ద్రుష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ఆచితూచి బీజేపీ వ్యవహరిస్తోందని చెప్పొచ్చు.