బీజేపీలో చేరిన తర్వాత సరిగా వార్తల్లో లేకుండా పోయిన సీఎం రమేష్ ఈరోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం తరఫున గెలిచిన రమేష్ తర్వాత బీజేపీలో చేరిపోయారు. ఇపుడు ఏకంగా బీజేపీని ఏపీ అధికారంలో చూడాలని కలలు కంటున్నారు. కలలు కనొచ్చు. కానీ నెరవేర్చుకునే అవకాశం ఉన్న కలలు కంటే బాగుంటుంది.
ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా… దేశంలో ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా బీజేపీనే గెలుస్తోందని, పక్కన తెలంగాణలో గెలిచిందని, ఆంధ్రాలో కూడా బీజేపీ గెలుస్తుందని సీఎం రమేష్ సెలవిచ్చారు. మొన్నే వారణాసి ఉప ఎన్నికల్లో, మహారాష్ట్ర ఉప ఎన్నికల్లో వారు ఓడిపోయారు. కాకపోతే అవి ఎమ్మెల్సీ ఎన్నికలు. సరే ఆయన దృష్టిలో శాసన సభవే అని లెక్కేసుకున్నా… దాని వెనుక నిజానిజాలు కూాడా ప్రజలకు తెలుసు. అది పక్కన పెడితే అసలు ఏపీలో బీజేపీ సత్తా ఏంటి? రమేష్ కోరిన కోరిక ఏంటి? అసలు అది సాధ్యమయ్యే పనేనా?
మీరలా అంటారు గాని పక్కనే ఉన్న తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో సైతం బీజేపీ గెలిచింది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని ఆయన ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు సీఎం రమేష్. తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి ఆయన ఈమాటలు మాట్లాడారు.
అయినా, ఏపీకి -తెలంగాణకు చాలా తేడా ఉందన్న విషయాన్ని బీజేపీ తెలుసుకోవాలి. అయినా గతంలో టీడీపీలో ఉన్న సీఎం రమేష్ కి మాత్రం ఆ విషయం తెలియదా. తెలుసు. కానీ మోటివేట్ చేస్తున్నాడు పార్టీకోసం. తెలంగాణ ఎప్పటి నుంచో బీజేపీకి లీడర్ షిప్ ఉంది. కానీ ఏపీలో భూతద్దం పెట్టి వెతికినా కానరాదు. అసలు ఏపీ బీజేపీ నాయకుడు ఎవరు? ఆయన ఎన్నికల్లో గెలిచిన చరిత్ర ఏంటి? ఆయన బహిరంగ సభ పెడితే వచ్చే జనాభా ఎంత? ఆయన ట్వీటు వేస్తే స్పందించే జనం ఎంత మంది ఇవన్నీ ప్రశ్నలు వేసినా అర్థమవుతుంది.
ప్రాక్టికల్ గా చూసినా… ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది టీడీపీ, వైసీపీ చేతిలో కాదు, నోటా చేతిలో ఓడిపోయింది. ఇది జగమెరిగిన సత్యం. ఎపుడు రావాలి ఏపీలో బీజేపీ పైకి… మరి మోటివేట్ చేయడం రమేష్ బాధ్యత కదా. కానీయండి కానీయండి.