దుబ్బాక ఒక సాధారణ ఉప ఎన్నికే కావచ్చు. కానీ రాబోయే ఎన్నికల వ్యూహాలను మార్చబోయే గెలుపు ఇది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీపై కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఘటన. ఏపీలో పుంజుకోవడం సాధ్యం కాకపోయినా.. తెలంగాణలో మాత్రం బీజేపీ పరుగు వంద కిలోమీటర్ల స్పీడుతో ఉంది. ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో యువరక్తం పరుగులు పెడుతోంది. తాజా గెలుపు అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందన హాట్ హాట్ గా ఉంది.
దుబ్బాక ఉప ఎన్నిక విజయం తెలంగాణ ప్రజలందరీ విజయం. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వంపై ప్రజల తిరుగుబాటు. దుబ్బాక ప్రజల్లో నిజాయితీ ఉంది. ఇదే స్ఫూర్తితో గోల్కొండ కోటపైనే బీజేపీ జెండా ఎగురబోతోంది.. అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రామరాజ్య స్థాపన ఖాయం అని, మాపై అవాస్తవాలు ప్రచారం చేసిన టీఆర్ఎస్ కి దుబ్బాక ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. దుబ్బాక గెలుపు విజయోత్సవాలు కూడా అడ్డుకుంటున్నారంటే… టీఆర్ఎస్ ఎంత భయపడుతుందో అర్థమవువతోందని విమర్శించారు.
గెలిచినట్లు అధికారిక గుర్తింపు పత్రం అందుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్‌రావు మాట్లాడుతూ ‘‘ఈ తీర్పు కేసీఆర్ కు కనువిప్పు కావాలి‘‘ అన్నారు. ఈ విజయం దుబ్బాక ప్రజలకే అంకితం అన్నారు. ప్రజల్లో చైతన్యం ఉవ్వెత్తున ఎగసింది. దుబ్బాక విజయ శంఖారావం కేసీఆర్ వినాలి అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. దుబ్బాక విజయానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటాం అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఏకమై నన్ను వేధించారు. కానీ నాకు ప్రజలు అండగా ఉన్నారన్నారు.టీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు ముగింపు పలకడం మొదలుపెట్టారని దుబ్బాక నిరూపించిందని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ ఆయువు పట్టును కొట్టాం- కిషన్ రెడ్డి
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఒక ఉప ఎన్నిక గెలుపు మాత్రమే కాదు, అది టీఆర్ఎస్ పతనానికి ఆరంభం అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు ఆయువుపట్టు అయిన ప్రాంతంలో బీజేపీ గెలిచింది అంటే ప్రజల్లో కేసీఆర్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. ఇకపై ఈ జోరు కొనసాగుతుంది అని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈ విజయం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు.