ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమిదే విజయమన్న సోము… బీసీలను ముఖ్యమంత్రి చేసేందుకు జగన్, చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. దీంతో, సోముపై జనసేనాని పవన్ కల్యాణ్, జనసేన నేతలు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఆల్రెడీ తిరుపతి బీజేపీ అభ్యర్థిపై సోము సొంత నిర్ణయం ప్రకటించడంతో ఆ రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అంటూ సోము చేసిన ప్రకటనతొ ఆ గ్యాప్ మరింత పెరిగిందని టాక్ వస్తోంది. బీసీ సీఎంను కాదనలేని పరిస్థితిలో ఉన్న జనసేన నేతలు, కార్యకర్తలు… తమ అధినేత పవన్ను వద్దనలేని సంకట స్థితిలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. సోము ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, బీసీలపై సోముకు అంత ప్రేముంటే గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవుల్లో ఒకటి బీసీలకు ఎందుకు ఇప్పించలేకపోయారని వారు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశానికే తలమానికమైన పలు సంస్థలను అమ్మకానికి పెడుతున్నారంటూ విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జియోకు మద్దతిచ్చి బీఎస్ఎన్ఎల్ ను నిర్వీర్యం చేసిన బీజేపీ సర్కార్…ఎయిరిండియా, ఎల్ ఐసీల విక్రయం, ప్రైవేటు రైళ్లకు అనుమతులు, ఐఆర్ సీటీసీలో వాటా విక్రయం వంటి చర్యలతో దేశాన్ని తాకట్టు పెట్టే దిశగా పోతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రకటన తర్వాత సోము చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీకి అధికారం కట్టబెడితే చరిత్రాత్మక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేశారని, ఇక ఏపీలో అధికారం దక్కితే ఏకంగా రాష్ట్రాన్ని అమ్మేస్తారని, బీసీలతో పాటు అన్ని వర్గాలవారికి అన్యాయం జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి. ఉన్న ఆస్తులు అమ్ముకోవడం తప్ప సంపదను సృష్టించడం, పెట్టుబడులు తీసుకురావడం బీజేపీకి తెలియదని, ఏపీలో బీసీ ముఖ్యమంత్రి అంటూ కుల, మత రాజకీయాలు చేయడం మాని అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టే దిశగా ఏపీ బీజేపీ అడుగులు వేయాలని అంటున్నారు.