సంచలన వ్యాఖ్యలకు.. వివాదాస్పద మాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి అదిరిపోయే వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మహా కామెడీగా మారాయి. అయితే.. తాను చెబుతున్న విషయాలు సొంతంగా తాను చెబుతున్నవి కాదని.. పార్టీలో పెద్ద తలకాయ అయిన అమిత్ షా చెప్పినట్లుగా చెప్పి.. మరింత సంచలనానికి తెరతీశారు. ఇంతకూ ఆయన చెప్పిందేమంటే.. ప్రస్తుతం కేంద్రంలో కొలువు తీరిన బీజేపీని.. రానున్న రోజుల్లో నేపాల్.. శ్రీలంకలకు విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారు త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్.
రాష్ట్ర రాజధాని అగర్తలలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. సంచలన వ్యాఖ్యల్నిచేశారు. నేపాల్.. శ్రీలంక దేశాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని గతంలో పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన అమిత్ షా తనకు చెప్పినట్లుగా పేర్కొన్నారు. 2018లో త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు రెఢీ అవుతున్న వేళలో జరిగిన భేటీలో.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గెలిచి.. పొరుగు దేశాల్లోనూపార్టీని విస్తరించాలన్న పథక రచన జరిగిందన్నారు. తాను చెబుతున్నవి తన మాటలు కావని.. ఒకప్పుడు అమిత్ షా తనకు చెప్పినవంటూ వివరణ ఇస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.
‘అప్పట్లో అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. ఒక ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఉన్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని పార్టీ జోనల్ కార్యదర్శ ిఅజయ్ జమ్వాల్ చెప్పారు. దీనికి స్పందించిన అమిత్ సా.. ఇంకా శ్రీలంక.. నేపాల్ మాత్రం మిగిలి ఉన్నాయి. అక్కడ కూడా మన పార్టీని విస్తరించి.. గెలిచి అక్కడ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయాలనిఅమిత్ సా చెప్పారు’’ అని సీఎం బిప్లవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి..దీనిపై అమిత్ షా ఏమంటారో చూడాలి.