ఎఫ్సీఐకి బడ్జెట్లో రూ.65 వేల కోట్లు కోత పెట్టారు.ఉపాధి హామీకి రూ.25వేల కోట్లు తగ్గించారు. ఎస్సీలు, ఎస్టీలు,మైనార్టీలకు రిజర్వేషన్ పెరగాలని కోరుతున్నాం..ఇవన్నీ తప్పా? అని ప్రశ్నిస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి.తాజాగా బీజేపీతో చేస్తున్న యుద్ధంలో కేసీఆర్ తో పాటు హరీశ్ రావు గొంతు కలుపుతున్నారు. ఆయన కూడా తీవ్ర స్థాయిలో బీజేపీని విమర్శిస్తూ కొన్ని వివరాలు, వాస్తవాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
త్వరలో కేసీఆర్ నేతృత్వాన జాతీయ పార్టీ పెట్టేందుకు అవకాశాలు ఉండడంతో ఎక్కువగా నాటి పరిణామాల గురించి మాట్లాడేందుకు,వాటి విషయంలో అమిత్ షా మొదలుకుని కిషన్ రెడ్డి వరకూ ఎలా వ్యవహరించారు అన్నవిషయమై వివాదం రేపుతున్నారు.తెలంగాణ వచ్చింది కనుకనే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కాగలిగారని కూడా అంటున్నారు హరీశ్ రావు.
ఇది కొంచెం విడ్డూరంగానే ఉంది.ఉమ్మడి రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం అందించిన పదవులు, కానుకలు,తాయిలాలు అందుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.ఆ రోజు తెలంగాణ నుంచి,ఆంధ్రా నుంచి యూపీఏ సర్కారులో మంచి ప్రాధాన్యమే ఉంది. మారుమూల శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణికి ఆ రోజు కేంద్ర మంత్రి పదవి కేటాయించారు.
మొదటిసారిగా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికయినప్పటికీ ఆమెకు మంచి ప్రాధాన్యమే దక్కింది.అదే రీతిన తెలంగాణ నాయకులను కూడా కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంది.ఆ లెక్కన చూస్తే బీజేపీలో కాస్త ప్రాధాన్యం తగ్గినా చెన్నమనేని విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ అలియాస్ దత్తన్న లాంటి వారికి కూడా మంచి ప్రాధాన్యమే ఉంది.అయితే రాష్ట్రం విడిపోయినంత మాత్రానే వీరికి పదవులు వచ్చాయి అని చెప్పడం లేదా చెప్పుకోవడం అన్నవే హాస్యాస్పదం.
కనుక ఈ యుద్ధంలో కేసీఆర్ గెలవాలంటే పాత తగువులు తవ్వడం ఒక్కటే ప్రాధాన్యాంశం అని అనుకుంటే తగదు.తెలంగాణ నీళ్లు,నిధులు, నియామకాలు అనే విషయాల్లో కేంద్రంతోపాటు రాష్ట్రం కూడా చేయాల్సింది ఎంతో ఉంది. వాటి విషయమై ఇవాళ కేసీఆర్ ఫెయిల్ అవుతున్నారు అన్న మాట వాస్తవం.
ఇంతవరకూ నియామకాలు విషయమై ఏమీ తేల్చని అసమర్థతలో ఆయన ఉన్నారని బీజేపీ అంటోంది.అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున ఇంతవరకూ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో తేల్చాలని అంటోంది. వీటిపై పూర్తి స్పష్టత ఇచ్చాక హరీశ్ రావు కానీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ కానీ మాట్లాడితే ఆనందం.