ఎవరు అవునన్నా.. కాదన్నా రాజకీయాలు చాలా కర్కశంగా ఉంటాయి. మొహమాటాలు.. మంచితనం అస్సలు పనికి రాదు. బిజినెస్ కు మించిన కచ్ఛితత్త్వం రాజకీయాల్లో చాలా అవసరం. ఈ విషయాన్ని గుర్తించే.. సున్నిత మనస్కులు రాజకీయాల్లోకి రావొద్దని చెబుతుంటారు. చిరంజీవిలాంటి వారు పాలిటిక్స్ లోకి వచ్చి.. ఇది తనకు ఏ మాత్రం సూట్ అయ్యేది కాదన్న విషయాన్ని చాలా త్వరగా గమనించి.. తన దారిన తాను వెళ్లిపోవటం తెలిసిందే.
రాజకీయాల్లోకి వచ్చి అన్న ఏ తప్పులు అయితే చేశారో.. తాను మాత్రం ఆ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయన్నట్లుగా వ్యవహరించిన పవన్.. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగినతర్వాత నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తేలిపోతున్నాయి.
ఇది సరిపోనట్లు ఈ మధ్యన బీజేపీతో జట్టుకట్టిన ఆయన నిర్ణయాన్ని చూసిన వారంతా చాలా తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నారనేవారు. కానీ.. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఎంత మిత్రుడైతే మాత్రం అంతలా అవమానించటమా? అన్నది ప్రశ్నగా మారింది. మొన్నటికి మొన్న గ్రేటర్ హైదరాబాద్ కు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావించిన జనసేనాని.. అందుకు తగ్గట్లే ప్రకటన విడుదల చేశారు.అభ్యర్థుల కసరత్తును షురూ చేశారు.
అంతలో ఎంట్రీ ఇచ్చిన బీజేపీ నేతలు.. పవన్ ను పోటీ నుంచి విరమించేలా చేయటమే కాదు.. గ్రేటర్ ఎన్నికలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు కాకుండా.. తమకు తాముగా నిర్ణయం తీసుకున్నమన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసి.. పవన్ ను చిన్నబుచ్చారు. ఇదిలా ఉంటే.. తిరుపతిలో జరిగే లోక్ సభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని పవన్ భావించారు. అందుకు భిన్నంగా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. తిరుపతిలో తాము పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
తిరుపతిలో బీజేపీతో పోలిస్తే.. పవన్ కే ఇమేజ్ ఎక్కువన్నది మర్చిపోకూడదు. అయినప్పటికి జనసేనానికి ఏ మాత్రం ఇవ్వకుండా.. తాము బరిలోకి దిగుతామని.. తమకు జనసేనాని మద్దతు ఇవ్వాలనికోరటం ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో ఎంత పవర్ లో ఉన్నప్పటికి తిరుపతిలో తమ పాత్ర చాలా పరిమితమన్న విషయాన్ని బీజేపీ నేతలు మర్చిపోవటం ఒక ఎత్తు అయితే.. మిత్రధర్మాన్ని పాటించకుండా పవన్ చిన్నబుచ్చుకునేలా ప్రకటనలు చేయటం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు. ఈ మాత్రం మర్యాదకు కమలనాథులతో పవన్ కలిసి ఉండాల్సిన అవసరం ఉందంటారా? అన్నది ప్రశ్నగా మారింది. మరి.. దీనికి పవన్ ఏమంటారో?