విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం బీజేపీలో తీవ్ర గందరగోళం రేపుతున్నట్లే ఉంది. అందుకనే బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు నోటికొచ్చినట్లు అడ్డదిడ్డంగా మాట్లాడేస్తున్నారు. పార్టీ, కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా సమర్ధంచుకోవాలో అర్ధంకాక అబద్ధాలు చెబుతున్నారు. తాజాగా గోరంట్లలో వీర్రాజు మాట్లాడుతు స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. అలాగే ఉక్కు ను ప్రైవేటీకరించబోతున్నట్లు కేంద్రప్రభుత్వం కూడా ఎప్పుడూ చెప్పలేదట.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు బీజేపీకి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ అన్నది కేంద్రప్రభుత్వ రంగ సంస్ధ. అలాగే బీజేపీ అనేది ఓ రాజకీయపార్టీ. కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే అంశం పార్టీ పరిధిలో లేదు కాబట్టి బీజేపీ ప్రకటించే అవకాశం లేదు. ఇంతచిన్న విషయం కూడా వీర్రాజుకు మరచిపోవటమే విచిత్రంగా ఉంది.
ఇక కేంద్రం కూడా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని ఎప్పుడూ చెప్పలేదని చెప్పటమే విడ్డూరంగా ఉంది. నిండు పార్లమెంటులో కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీని ధక్షిణ కొరియా సంస్ధ పోస్కో కంపెనీకి అప్పగించేందుకు ఎంవోయు కూడా జరిగిందని ప్రకటించిన విషయం వీర్రాజు మరచిపోయారా ? ప్రైవేటు పోస్కా కంపెనీకి అప్పగించేందుకు ఎంవోయు కూడా జరిగిందని చెప్పటమంటే ఏమిటర్ధం ?
పోనీ ఈ విషయాలను పక్కన పెట్టేస్తే పెద్ద బృందాన్ని వేసుకుని వీర్రాజు అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్లు ? ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన అంశాన్ని కేంద్రంతో మాట్లాడి ఉపసంహరింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తామని స్వయంగా చెప్పిన విషయాన్ని మరచిపోయారు. కేంద్ర నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకునేట్లుగా ప్రయత్నిస్తామని వీర్రాజు ఢిల్లీకి వెళ్ళటంతోనే అర్ధమైపోతోంది విషయం. అయితే ఢిల్లీ వెళ్ళిన వీర్రాజు బృందాన్ని అక్కడ ఎవరు పట్టించుకున్నట్లు లేదు. అందుకనే మీడియా ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాక నోటికొచ్చిన అబద్ధాలు చెప్పేస్తున్నారు.