ముఖ్యమంత్రి మమత రాజ్యంలో సంచలన సంఘటన చోటుచేసుకునింది. పశ్చిమబెంగాల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ అక్కడ అపుడే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒకవైపు మోడీ రబీంద్రనాథ్ ఠాగూర్ ని తలపించేలా గడ్డం పెంచుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బెంగాల్ లో కార్యాచరణకు వరుస మీటింగులు పెడుతున్నారు బీజేపీ పెద్దలు. అయితే, ఈరోజు బెంగాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించారు. ఆయన కాన్వాయ్ పై దుండుగులు దాడికి పాల్పడ్డారు. జాతీయ అధికార పార్టీ అధ్యక్షుడిపై దాడి దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే కేంద్ర హోంమంత్రి విస్మయానికి లోనయ్యారు. దాడి జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ లో ఘటనపై, శాంతి భద్రతల పరిస్థితిపై దర్యాప్తుకు ఆదేశించారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని గవర్నర్ ను హోంమంత్రి కోరారు.
బెంగాల్ రాజధాని కోల్ కతాకు 60 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. దాడులకు పాల్పడిన వారు తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు అని తెలుస్తోంది. పార్టీ కార్యకర్తల సమావేశం కోసం నడ్డా డైమండ్ హార్బర్ కు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ నియోజకవర్గం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి చెందినది కావడం గమనార్హం.
దాడి ఘటన మొత్తం వీడియో ఫుటేజీలో రికార్డయ్యింది. అరాచకంగా, ఆటవిక పద్ధతిలో రాళ్లతో కారు అద్దాలను పగలగొడుతున్న దృశ్యాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిపై రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడటం తీవ్ర గర్హనీయం అని అందరూ ఖండిస్తున్నారు. ఈ సంఘటన మరిన్ని విపరిణామాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తోంది.