మొదటిజాబితాలో 52 మందికి టికెట్లు ప్రకటించిన బీజేపీ అధిష్టానం కీలక నేతల్లో కొందరికి టికెట్లు ప్రకటించలేదు. మామూలుగా అయితే పార్టీలోని కీలక నేతలకు టికెట్లను పెండింగులో ఉంచటం జరగదు. కానీ ఇపుడు మాత్రం పార్టీ అధిష్టానం ఆశ్చర్యంగా కొందరికి టికెట్లు ప్రకటించి మరికొందరి పేర్లను ప్రకటించకుండా హోల్డులో ఉంచేసింది. దీనిపై పార్టీతో పాటు బయటకూడా అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి అనుమానాల్లో ముఖ్యమైనది ఏమిటంటే సీనియర్లలో కొందరు పార్టీకి గుడ్ బై చెప్పేయబోతున్నారని అధిష్టానంలో అనుమానం పెరిగిపోతుండటమేనట.
ఇంతకీ విషయం ఏమిటంటే మొదటి జాబితాలో విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, గడ్డం వివేక్, జితేందర్ రెడ్డి బూర నర్సయ్య గౌడ్, డీకే అరుణ లాంటి కొందరి పేర్లు కనబడలేదు. డీకే అరుణ విషయంలో పార్టీ మారుతున్నారనే ప్రచారమైతే జరగటంలేదు. అయినా ఎందుకు టికెట్ ప్రకటించలేదో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇక మిగిలిన నేతల విషయం లో అయితే పార్టీ మారుతారనే ప్రచారం బాగా జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది.
కొండా విశ్వేశ్వరరెడ్డి, గడ్డం వివేక్, విజయశాంతి విషయంలో కూడా ఇలాంటి ప్రచారాలే జరుగుతున్నాయి. ఇందుకు వీళ్ళ వైఖరి కూడా దోహదపడుతోందని చెప్పాలి. అదేమిటంటే పార్టీ నాయకత్వంపై రెగ్యులర్ గా కామెంట్లు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యవహార శైలిపై నిత్యం అసంతృప్తిని వ్యక్తంచేస్తునే ఉన్నారు. ఇదే సమయంలో నరేంద్రమోడీ, అమిత్ షా తెలంగాణా పర్యటనల్లో కూడా వీళ్ళు కనబడలేదు.
మామూలుగా ఎవరికి పార్టీపై ఎలాంటి అసంతృప్తి ఉన్నా మోడీ, అమిత్ షా పర్యటనల్లో కూడా పాల్గొనకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. తమలోని అసంతృప్తిని డైరెక్టుగా మోడీ, అమిత్ కు చెప్పుకునే అవకాశాన్ని కూడా వీళ్ళు వదులుకున్నారంటేనే పార్టీలో ఉండకూడదని డిసైడ్ చేసుకున్నారని అర్ధమవుతోంది. పార్టీ అధిష్టానం కూడా ఇదే పద్దతిలో ఆలోచించే మొదటిజాబితాలో టికెట్లు ప్రకటించలేదని పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. మరి రెండోజాబితాలో ఎవరెవరి పేర్లుంటాయో ? సీనియర్లు ఏమిచేస్తారో చూడాల్సిందే.