రోజులన్నీ ఒకేలా ఉండవన్నది.. మిగిలిన రంగాల్లో కంటే రాజకీయ రంగానికి చాలా బాగా సూట్ అవుతుంది. అనూహ్య పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా రాజకీయాలు నిలుస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒక ఉదంతం తెలంగాణలో చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. హిందుత్వ ఎజెండాతో దూసుకెళుతూ.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సంచలన రాజకీయ నేత రాజాసింగ్ చూపు సైకిల్ మీద పడినట్లుగా చెబుతున్నారు. కొద్దినెలల క్రితం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజాసింగ్ మీద వేటు వేసిన బీజేపీ.. అతడి మీద వేటు తీసేందుకు అంత ఆసక్తి చూపని పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి సీటు వచ్చే అవకాశాలు అంతకంతకూ తక్కువ అవుతున్న వేళ.. ఆయన చూపు తెలుగుదేశం పార్టీ మీద పడినట్లుగా చెబుతున్నారు.
తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన టీడీపీలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు వీలుగా ఆయన పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ఎన్నికలు ఈ అక్టోబరులో జరగనున్న నేపథ్యంలో.. తాను టీడీపీ నుంచి పోటీ చేసేందుకు రాజాసింగ్ సానుకూలంగా ఉన్నారు. టీడీపీ ముఖ్యనేతలతో భేటీ అయిన రాజాసింగ్.. సైకిల్ ఎక్కే విషయంలో తన ఆసక్తిని స్పష్టం చేయటంతో పాటు.. తనకు అవకాశం ఇస్తే మరోమూడుచోట్ల పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తానన్న మాటను చెప్పినట్లుగా సమాచారం.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నుంచి తనను సస్పెండ్ చేసి నాలుగు నెలలు అవుతున్నా.. ఇప్పటివరకు తన గురించి పట్టించుకోకపోవటంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అందుకే ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 2009లో టీడీపీలో చేరినరాజాసింగ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్ గా వ్యవహరించారు.
అనంతరం బీజేపీలోకి చేరినఆయన 2014లో గోషామహాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ముకేశ్ గౌడ్ మీద భారీ మెజార్టీతో గెలుపొందారు. ఒక వర్గం మీద చేసిన వ్యాఖ్యలపై జైలుకు వెళ్లిన రాజాసింగ్ ను బీజేపీ అధినాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇది జరిగి ఆర్నెల్లు అవుతున్నా.. తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోని కమలనాథులతోకలిసి వెళ్లే కన్నా.. తన పూర్వ పార్టీ అయిన టీడీపీలో చేరి..గోషామహల్ బరిలోకి దిగాలన్న పట్టుదలతో రాజాసింగ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో ఇటీవల భేటీ అయినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతున్న టీడీపీకి రాజాసింగ్ ఒక చక్కటి అవకాశంగా మారినట్లు చెబుతున్నారు. రాజాసింగ్ ఎంట్రీతో తెలంగాణలో టీడీపీ పుంజుకోవటానికి వీలుంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. రాజాసింగ్ ను చేర్చుకోవటం ద్వారా పార్టీకి జరిగే లాభనష్టాలపై పెద్ద ఎత్తున మదింపు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. రాజాసింగ్ రాకతో రాష్ట్ర పార్టీలో కొత్త ఉత్సాహం ఖాయమన్నఅభిప్రాయం వ్యక్తమవుతున్నా.. కీలకమైన మైనార్టీ ఓట్లపై ప్రభావం పడుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అదే ఆయన ఎంట్రీకి అడ్డంకిగా ఉన్నట్లు చెబుతున్నారు. రాజాసింగ్ కానీ టీడీపీలోకి చేరితే.. గోషాహమల్ తో పాటు.. ఖైరతాబాద్.. జూబ్లీహిల్స్.. సనత్ నగర్ .. ముషీరాబాద్ తో పాటు అంబర్ పేట.. సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ప్రభావం పడే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. సైకిల్ ఎక్కేందుకు రాజాసింగ్ కు పచ్చ జెండా ఊపుతారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.