'Burnol' moment https://t.co/r1149fpAgE
— Raja Singh (Modi Ka Parivar) (@TigerRajaSingh) February 6, 2022
తెలంగాణలో రాజకీయ వేడి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టటంపై పలువురు తప్పు పడుతున్నారు. బీజేపీ నేతలు అయితే విరుచుకుపడుతున్నారు. దీనికి సంబంధించి వాద.. ప్రతివాదాలతో సోషల్ మీడియా వేడెక్కిపోయింది.
ఈ ఎపిసోడ్ లో ప్రధాని మోడీకి స్వాగతం పలికే వేళలో.. టీఆర్ఎస్ తీరు వేలెత్తి చూపేలా మారింది. దీనికి కారణం.. వారు వినిపిస్తున్న వాదనలే. ఒకపక్క స్వల్ప జ్వరం కారణంగా హాజరు కాలేదని చెబుతూనే.. మరోవైపు ఇది ప్రైవేటు ప్రోగ్రాం అని.. ప్రభుత్వ ప్రోగ్రాం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదో ఒక స్టాండ్ మీద నిలబడితే బాగుండేది. అందుకు భిన్నంగా ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యానించటం ద్వారా.. కావాలనే రాకుండా హ్యాండిచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రధానమంత్రి హోదాలో వచ్చిన మోడీని.. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ స్వాగతం పలికితే బాగుండేదని.. రాజకీయ విభేదాల్ని పక్కన పెట్టాలన్న మాటతో టీఆర్ఎస్ ఇరుకున పడుతోంది. ఈ ఎపిసోడ్ లో బీజేపీ వాదనకు సోషల్ మీడియాలో సానుకూలత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. మొత్తం చర్చను మరో దారి పట్టించే అస్త్రాన్ని సంధించారు మంత్రి కేటీఆర్.
తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఇది రాజకీయ దుమారంగా మారింది. పక్షపాతానికి ప్రతీక లాంటి వ్యక్తి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘
‘సమతామూర్తి విగ్రహావిష్కరణ వివక్షకు నిలువెత్తు నిదర్శనం. సమతామూర్తి స్ఫూర్తికే విరుద్దం. పక్షపాతానికి ఐకాన్ లాంటి వ్యక్తి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు’ అని పేర్కొన్నారు. దీనికి #StatueOfEquality అనే హ్యాష్ ట్యాగ్ ను మంత్రి కేటీఆర్ జత చేశారు.
శనివారం నాడు తెలంగాణలో ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న వేళ.. తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. కేటీఆర్ ట్వీట్ అస్త్రానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రియాక్టు అయ్యారు.
కేటీఆర్ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ.. ‘‘కేటీఆర్ కు బాగా కాలుతున్నట్లుంది’’ అనే అర్థం వచ్చేలా రీట్వీట్ చేశారు. ఒకరిపై ఒకరు వాడివేడి ట్వీట్లను సంధించుకోవటంతో తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పక తప్పదు. మంత్రి కేటీఆర్ ట్వీట్ కు బీజేపీకి చెందిన ఇతర నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.