తెలంగాణ అధికారపక్షం వ్యవహరిస్తున్న తీరుపై సీనియర్ నేత ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నట్లు చెప్పారు. బీజేపీలో చేరే నేతల మీద రాత్రికి రాత్రి కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. చౌటుప్పల్ ఎంపీపీ బీజేపీలో చేరగానే అర్థరాత్రి ఇంటికి వెళ్లి పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని.. కేసులు పెట్టి భయపెడుతున్నట్లుగా ఆరోపించారు.
అధికారం ఎప్పుడూ టీఆర్ఎస్ చేతిలోనే ఉండదన్న ఈటల.. టీఆర్ఎస్ చేసే తప్పుల్ని తాము లెక్కిస్తున్నామని.. తర్వాత లెక్కలు తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీలో చేరే నేతలపై పీడీ యాక్టు పెట్టి జైల్లో వేయాలని చూస్తున్నారని.. ఇది చాలా దారుణంగా పేర్కొన్నారు. వేలాది మంది ఎంపీటీసీలు.. వందల సంఖ్యలో ఎంపీపీలు.. జెడ్పీ ఛైర్మన్లు.. ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు.
ఎన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేసినా బీజేపీలోకి చేరే నాయకుల్ని ఆపలేరన్న ఈటల.. కేసులతో తమను భయపెట్టలేరన్నారు. ‘కూలీ పనులు చేసుకునే బీజేపీ కార్యకర్తల్ని కూడా వదలటం లేదు. వారిని సైతం వివిధ రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఇలాంటి చిల్లర రాజకీయాల్ని మానుకోవాలి. మీరు చేసిన తప్పులన్నీ లెక్క పెడుతున్నాం. తప్పకుండా ఆ లెక్కలు తేలుస్తాం’ అన్న ఈటల వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.