కర్ణాటకలో హిజాబ్ వ్యవహారంపై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్….తదుపరి విచారణను డివిజన్ బెంచ్ కు బదిలీ చేసింది. దీంతో, ఈ వ్యవహారంపై కోర్టు తీర్పు రావడానికి మరి కొద్ది రోజులు పట్టేలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటకలో హిజాబ్ ధరించిన విద్యార్థినులకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా బాసటగా నిలిచారు.
బికినీ వేసుకోవాలా, చీరకొంగుతో ముసుగు వేసుకోవాలా, జీన్స్ ధరించాలా అనే హక్కుకు భారత రాజ్యాంగం కల్పిస్తోందని హామీ ఇస్తోందని అన్నారు. వస్త్రధారణ పేరుతో మహిళలను వేధించడం ఆపాలని, ‘లడ్కీహూ లడ్సక్తీ హూ’ అంటూ హ్యాష్ ట్యాగ్ జతచేసి ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ప్రియాంకా వ్యాఖ్యలపై బీజేపీ కర్ణాటక ఎమ్మెల్యే రేణుకాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బికినీ అని కామెంట్ చేయడంతోనే ప్రియాంకా గాంధీ ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోవాలంటూ కామెంట్ చేయడం దుమారం రేపుతోంది.
కాలేజీకి, స్కూలుకు వెళ్లే విద్యార్థులంతా నిండుగా బట్టలేసుకోవాల్సిన అవసరం ఉంటుందని, మహిళల వస్త్రధారణ వల్లే రేప్ లు జరుగుతున్నాయని రేణుకాచార్య కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. స్త్రీలు వారి వస్త్రధారణతోనే మగవారిని రెచ్చగొడుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మరి, ఈ కామెంట్లపై ప్రియాంకా గాంధీ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.