తెలంగాణలో బీజేపీ దూకుడు అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరాలని నిర్ణ యించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ నేతలు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఒక విడత పార్టీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర కూడా పూర్తి చేసుకున్నారు. ఇక, మరోవైపు.. జిల్లాలకు బాధ్యులను కూడా(పాలక్) పార్టీ అధిష్టానం ఇప్పటికే నియమించింది.
ఇక, బీజేపీలోకి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరిచే ఉంటుందని చెప్పడం ద్వారా.. మరింత మంది కీలక నేతలను కూడా పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ నేతలు రెడీగా ఉన్నారనే సంకేతాలు కూడా పంపిస్తు న్నారు. ఇక, ఇప్పుడు తాజాగా బీజేపీ `ఆపరేషన్ 90` అనే నినాదంతో ముందుకు సాగుతోందని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇదే విషయం సోషల్ మీడియాలోనూ చర్చకు వస్తోంది.
మరి ఈ మిషన్-90 ఏంటి? అనేది చూస్తే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 90 స్థానాలను బీజేపీ టార్గెట్గా పెట్టు కుందని.. అందుకే ఈ లక్ష్యం మిషన్-90 పేరుతో సాధించే దిశగా అడుగులు వేసేందుకు నాయకులు ఉద్యుక్తులవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే(రాజాసింగ్) బీజేపీ తరఫున విజయం ద క్కించుకున్నారు.
తర్వాత దుబ్బాక, హూజూర్ నగర్ లలో వచ్చిన ఉప ఎన్నికలో విజయం దక్కించుకుంది. అయితే..ఈ ఊపుతో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలనేది బీజేపీ నేతల వ్యూహంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో 90 స్థానాల్లో విజయం దక్కించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 60 స్థానాలు గెలుచుకుంటే సరిపోతుంది. అయితే.. దీనికి మించి అన్నట్టుగా బీజేపీ లక్ష్యం నిర్ణయించుకుంది.
అయితే.. దీనిని సాధిస్తారు? అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే.. పట్టణాల్లో ఒకింత హవా చూపించే ప్రయత్నం చేసినా.. గ్రామీణ తెలంగాణలో బీజేపీకి పట్టు లేదు. అంతేకాదు.. నాయకులు కూడా లేరు. ఇక్కడ పార్టీని సన్నద్ధం చేయడం అంటే మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి. అనేక ఇబ్బందులు తట్టుకుని ఎదగాలి. ఇది సాధించకుండా.. ఎన్ని మిషన్లు పెట్టుకున్నా.. ఎంతగా పరుగులు పెట్టినా ప్రయోజనం లేదని అంటున్నారు పరిశీలకులు.