తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీకి సరైన అభ్యర్థులు కరవయ్యారా? టికెట్ వద్దన్న వాళ్లకూ సీటు ఇచ్చే స్థితికి ఆ పార్టీ చేరుకుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా 35 మందితో బీజేపీ ప్రకటించి మూడో జాబితాలో బాబూ మోహన్ కు టికెట్ దక్కడమే ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు. ఆందోలు టికెట్ ను బాబూ మోహన్ కు కేటాయిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
మొదట 52 మందితో బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. కానీ ఇందులో బాబూ మోహన్ పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆందోలు సీటును ప్రకటించనప్పటికీ బాబూ మోహన్ మాత్రం బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి జాబితాలో పేరు దక్కకపోవడంతో అసహనం ప్రకటించారు. టికెట్ దక్కలేదని, పార్టీ మాజీ, తాజా తెలంగాణ అధ్యక్షులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని బాబూ మోహన్ ఆరోపించారు. టికెట్ కోసం తనకు, తన తనయుడికి మధ్య వైరం పెడుతున్నారని కూడా పేర్కొన్నారు. మలి విడతలో సీటు వచ్చినా పోటీ చేయనని కూడా ఖరాకండీగా చెప్పేశారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు పార్టీకి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు.
కానీ తాజాగా 35 మందితో బీజేపీ ప్రకటించిన మూడో జాబితాలో ఆందోలు సీటును బాబూమోహన్ కే కేటాయించారు. దీంతో పోటీ చేయనని చెప్పినప్పటికీ బాబూ మోహన్ వెనకాల బీజేపీ పడటం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ నియోజకవర్గంలో పార్టీకి బలమైన నేత లేకపోవడమే అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు దేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని మొదలెట్టిన బాబూ మోహన్ కు ఆందోల్ నియోజకవర్గంలో మంచి పట్టుంది. టీడీపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన బాబూమోహన్.. 2004, 2009లో ఓడిపోయారు. 2014లో బీఆర్ఎస్ లో చేరి గెలిచారు. 2018లో బీజేపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.