ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ పేరు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ‘మా’ఎన్నికలలో మంచు విష్ణు పోటీ చేయడం మొదలు…ఇటీవల మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ ఎక్విప్ మెంట్ చోరీ వ్యవహారం వరకు మోహన్ బాబు, విష్ణుల పేర్లు వార్తల్లో వినిపిస్తున్నాయి. మోహన్ బాబు ఫ్యామిలీ మాజీ హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను వ్యవహారంలో మోహన్‌బాబు, విష్ణులపై బీసీ సంఘాల నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో మంచు విష్ణు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. మంచు విష్ణు తాజా చిత్రం టైటిల్ పై దుమారం రేగుతోంది. ‘జిన్నా’ అనే చిత్రంలో విష్ణు నటిస్తుండడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశద్రోహి ‘జిన్నా’ పేరును టైటిల్ గా తొలగించాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, ఈ సినిమా టైటిల్ ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడంపై కూడా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తిరుమల కొండల వెనుక నుంచి జిన్నా అనే పేరు వస్తున్నట్లుగా ఆ టైటిల్ ను మేకర్స్ డిజైన్ చేశారు. అయితే, ఈ పేరుతో పాటు తిరుమల కొండలపై జిన్నా అనే పేరు ఉంచడంతో బీజేపీ ఆగ్రహం రెట్టింపైంది. దీంతో, ఆ టైటిల్ ను, లోగోను తొలగించాలంటూ ఏపీ బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి హెచ్చరించారు. మహ్మద్ అలీ జిన్నా గురించి మంచు విష్ణు తెలుసుకోవాలని విష్ణు వర్థన్ రెడ్డి హితవు పలికారు.
‘‘భారత దేశంలో వేల మంది ఊచకోతకు కారణమైన వ్యక్తి జిన్నా పేరుపైన మంచు విష్ణు సినిమా పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు. దేశంలో ఒకే ఒక్క చోట్ గుంటూరులో జిన్నా టవర్ అనే పేరుతో ఒక నిర్మాణం ఉండగా, దాన్ని తొలగించాలని మేం ఉద్యమం చేస్తుంటే.. సినిమాల్లో జిన్నా పేరును పెట్టుకున్నారు. ఏకంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొండలపైన అన్యమతస్థుడైన జిన్నా పేరుతో టైటిల్ తయారు చేసి రిలీజ్ చేయడం సిగ్గుచేటు. ఇటీవలే మంచు విష్ణు అనేక ప్రముఖుల విషయాల గురించి, కందూకూరి వీరేశలింగం గురించి మాట్లాడారు.
జిన్నా గురించి, మహ్మద్ జిన్నా జీవిత్ర చరిత్ర, అతని మానభంగాల గురించి మీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి, సినిమాల్లో ప్రచారం కోసం మరో రామ్ గోపాల్ వర్మ మాదిరిగా, దేశ విభజనకు కారకుడైన వ్యక్తి పేరును తక్షణం ఉపసంహరించుకోవాలి. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొండలపై ఉంచిన జిన్నా టైటిల్ ను తొలగించి హిందువుల మనోభావాలను గౌరవించాలి. తక్షణం దాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని విష్ణు వర్థన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు.
కాగా, జిన్నా ఓ దేశద్రోహి అని, ఆ పేరుతో సినిమా తీయడమేంటని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ప్రశ్నించారు. మంచు విష్ణు చరిత్ర తెలుసుకోవాలని, జిన్నా కారణంగా ఎంతోమంది హిందువులు మానప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కాగా, ‘జిన్నా’లో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్ర పోషిస్తున్నారు. గాలి నాగేశ్వరరావు పేరును షార్ట్ కట్ లో ‘జిన్నా’ అని కుదించి దాన్నే టైటిల్ గా ఫిక్స్ చేయడంతో వివాదం రేగింది.