ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరం నడిబొడ్డులో ఉన్న జిన్నా టవర్ సెంటర్ గురించి ఆ జిల్లావాసులతో పాటు చాలామంది తెలుగు ప్రజలకు పరిచయం అక్కర లేదు. గుంటూరు నగరం నడిబొడ్డులో ఉన్న ఈ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం నిర్మించిన జిన్నా టవర్ ఉండడంతో ఈ సెంటర్ కు ఆ పేరు వచ్చింది. పాకిస్థాన్ జాతిపిత జిన్నాపేరుతో ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఆ స్థూపం అలాగే ఉండడంతో ఆ తర్వాత ఆ పేరు స్థిరపడిపోయింది. అయితే, తాజాగా ఏపీ బీజేపీ నేతలు ఈ సెంటర్ పేరు మార్చాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.
ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. దేశ విభజనానంతర అల్లర్లలో కొన్ని లక్షల మంది చావుకు కారణమైన జిన్నా పేరును గుంటూరులో ఓ సెంటర్ కు పెట్టడమేమిటని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆ సెంటర్ కు జిన్నా పేరును మార్చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలను విష్ణు సమర్థించారు.
ఆ టవర్ పేరు జిన్నా అని, ఆ ప్రాంతం పేరు జిన్నా టవర్ సెంటర్ అని, ఇది ఏ పాకిస్థాన్ లోనో లేదని, దురదృష్టం కొద్దీ ఏపీలోని గుంటూరులోనే ఉందని అన్నారు. మన దేశ ద్రోహి పేరును ఇంకా అలాగే ఉంచడం ఏమిటని అన్నారు. అబ్దుల్ కలాం పేరో లేదంటే దళిత కవి గుర్రం జాషువా పేరో ఆ సెంటర్ కు పెట్టాలని డిమాండ్ చేశారు. జిన్నా టవర్ సెంటర్ పేరును మార్చకుంటే ఆ టవర్ ను తాము కూల్చేస్తామని, పేరునూ మారుస్తామని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చామని, రాష్ట్ర రాజధానిలో మార్చలేమా? అని సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆ సెంటర్ పేరును మహాత్మా గాంధీ సెంటర్ గా మారుస్తామన్నారు.