ఏపీలో జరగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ వైసీపీ నేతలు బెదిరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక, ఓటర్లకు డబ్బు, మద్యం, చీరలు వంటివి పంచి ప్రలోభ పెడ్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.
ఈ క్రమంలోనే ఓటర్లకు ఎరవేసేందుకు వైసీపీ నేతలు తిరుమల వెంకన్ననూ వాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ తొండవాడ పంచాయతీ పరిధిలో ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు తిరుపతి లడ్డూను పంచడంపై దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓట్లకోసం ఇంత దిగజారడంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
శ్రీవారి లడ్డులతో వైసీపీ నేతలు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేసే (నిత్యావసర సరుకుల) రవాణా చేసే వాహనాల్లో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తిరుమల లడ్డూలు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. దేవుడిని రాజకీయానికి వాడుతున్నారని, తక్షణం టీటీడీ వారు ఈ విషయం మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం వెంటనే ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ను కోరారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి గారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విష్ణువర్ధన్‌రెడ్డి ట్వీట్ చేశారు. మరి, ఈ వ్యవహారంపై సీఎం జగన్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.