ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) , ఎస్డీపీఐ నాయకులను, కార్యకర్తలను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్న వైనం కలకలం రేపింది. కర్నూలులో ఎస్డీపీఐ నేత అబ్దుల్ వారిజ్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరులోని ఆటోనగర్ లోనూ ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.
ఈ సోదాలలో ఎన్ఐఏతో పాటు ఈడీ, స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. ఉగ్రవాదానికి ఫండింగ్, కరాటే శిక్షణ, ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రోత్సహించడం, మానసికంగా మళ్లించడం వంటి కార్యకలాపాలపై ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు చేస్తోంది. పీఎఫ్ఐ దాని విద్యార్థి విభాగానికి నిధులు సమకూర్చిన వ్యవహారంపై ఈడీ పరిశోధన చేసింది. ఎన్ఐఏ, ఈడీ సంయుక్తంగా చేస్తున్న ఈ ఆపరేషన్ ను.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వయంగా పర్యవేక్షిస్తుందని తెలుస్తోంది. బీహార్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, యూపీ, రాజస్థాన్, కర్ణాటకలో ఈ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థల కదలికల విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని విష్ణు విమర్శించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పీఎఫ్ఐ, ఎస్డీపీఐకు షెల్టర్ జోన్లుగా మారాయని అన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ,హఫీజ్ ఖాన్ వంటి వారు ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ తగులబెట్టిన వాళ్లపై కేసులు పెట్టొద్దని అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేసిన విషయాన్ని విష్ణు గుర్తు చేశారు. జైలు నుంచి విడుదలైన పీఎఫ్ఐ, ఎస్డీపీఐ పార్టీల నాయకులతో వైసీపీ ర్యాలీలు చేసిందని దుయ్యబట్టారు. గుంటూరు, రాయచోటి , ఆత్మకూరు పోలీస్ స్టేషన్లను తగులబెట్టిన వారిని అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని.. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ పార్టీలు వైసీపీ మిత్రపక్షాలా..? అని విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు.