2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ వాతావరణం క్రమక్రమంగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీ పై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరైనా 175కు 175 సీట్లు గెలుస్తామని చెబుతారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని జగన్ అన్ని విధాలుగా నాశనం చేశారని, ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసి చరిత్రలో చెత్త సీఎంగా జగన్ నిలిచిపోయారని షాకింగ్ కామెంట్స్ చేశారు. డబ్బుతో ఎన్నికల్లో గెలవవచ్చని జగన్ అనుకుంటున్నారని, కానీ ఆయన ఆశలు నెరవేరవని ఆయన అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. 3 నెలల్లో ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాత ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు.
మరోవైపు, సీఎం జగన్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. అబద్దాల పునాదులపై జగన్ బతుకుతున్నారని అచ్చెన్న దుయ్యబట్టారు. 3 వేల రూపాయల పెన్షన్ హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పారని విమర్శించారు. ఒక్కో లబ్ధిదారుడికి 30 వేల రూపాయలు ఎగనామం పెట్టారని ఎద్దేవా చేశారు. భేతాళుడి శాపం లాగా నిజాలు మాట్లాడితే జగన్ తల వెయ్యి ముక్కలవుతుందని చురకలంటించారు.
200 రూపాయల పెన్షన్ ను 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదని చెప్పారు. ఈ నాలుగున్నేళ్లలో జగన్ పెంచింది 750 రూపాయలు మాత్రమేనని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు హయాంలో 20 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశామని చెప్పారు. కానీ, జగన్ వచ్చిన తర్వాత రకరకాల కారణాలతో ఎంతోమంది పెన్షన్లు తీసివేశారని ఆరోపించారు. ఇక, జగన్ అబద్దాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.