తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేశారని.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇచ్చేంత దుర్మార్గానికి దిగజారారంటూ మోడీషాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ రియాక్టు అయ్యారు. ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ అగ్రనాయకత్వం ఎర వేసిందన్న కేసీఆర్ ఆరోపణలకుస్పందించిన ఆయన.. కేసీఆర్ వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఒక ఎమ్మెల్యేను కూడా తాము కొనుగోలు చేయాలని చూడలేదన్న తరుణ్ ఛుగ్.. కేసీఆర్ తన పార్టీ గురించి ఆందోళన చెందుతున్నారన్నారు. ‘ఫాంహౌస్ లోనే సినిమా కథ అల్లారు. ఎమ్మెల్యేలకు ఎర చూపలేదని పేర్కొంటూ ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేశారు. టీఆర్ఎస్ నేతలకు నిజాయితీ ఉంటే వారెందుకు ప్రమాణం చేయటం లేదు’ అని ప్రశ్నించారు.
తన పార్టీ గురించి కేసీఆర్ కలలో కూడా కంగారు పడుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. టీఆర్ఎస్ పాపాలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బదులిస్తారని పేర్కొన్నారు. సీఎంకేసీఆర్ తీవ్ర స్వరంతో భారీ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ.. మోడీ అండ్ కో నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం.. అధినాయకత్వానికి చెందిన వారెవరూ రియాక్టు కాకపోవటం.. చివరకుపార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుతు మాత్రమే స్పందించటం గమనార్హం.
టీఆర్ఎస్ నేతలకు నిజాయితీ ఉంటే.. గుళ్లో ఎందుకు ప్రమాణం చేయరన్న మాటకు కేసీఆర్ అండ్ కో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. అన్నింటికి మించి.. బేరసారాలు ఆడిన వ్యక్తికి బీజేపీ ముఖ్యనేతలతో సంబంధాలు ఉన్నాయన్న విషయానికి సంబంధించిన ఆధారాలు చూపకపోవటం..చూపించినవేవీ బలంగా లేకపోవటం ఒక మైనస్ పాయింట్ గా చెబుతున్నారు.